అవినీతి అంతం సాధ్యమేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అవినీతి అంతం సాధ్యమేనా


విజయవాడ, జూన్ 6, (way2newstv.com)
ఎన్నికల్లో విజయం సాధించి గెలవడం ఏదో ఒక పార్టీ చేస్తుంది. కానీ ఆ విజయాన్ని చరిత్రాత్మకం చేసుకోవాలనుకోవడం పెద్ద విషయమే. ప్రజలు సైతం అవినీతికి అలవాటు పడిపోతున్న స్థితిలో ప్రభుత్వంలో అవినీతిని అరికడతానంటున్నారు నవయువ ముఖ్యమంత్రి జగన్. ఎన్నికల కంటే ఇదే పెద్ద సవాల్ గా చెప్పుకోవాలి. కానీ గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఇదో పెద్ద సత్సంకల్పమనే చెప్పాలి. ఇంతటి మహత్కార్యం సాధించాలంటే సాహసం ఉండాలి. సంకల్ప సిద్ధి కావాలి. ఎదురు దెబ్బలు తట్టుకునే స్థైర్యం నిలువెల్లా సంతరించుకోవాలి. ఎందుకంటే ప్రతి అడుగులోనూ ప్రతిఘటన ఎదురవుతుంది. ఎంతటి వ్యక్తినైనా, శక్తినైనా నిలువరించగల నిబ్బరం అవసరం. ఏ వర్గం ప్రజలు ఎందుకు దూరమైపోతారోననే సంశయంతో, తమపై తమకే విశ్వాసరాహిత్యంతో అందర్నీ సంతృప్తిపరచాలనుకుంటూ బితుకు బితుకు మంటున్నారు నేటి నేతలు. నిరంతరం మీటర్లు పట్టుకుని సంతృప్తస్థాయుల కొలబద్దలు గీచుకుంటున్న తరుణం. 


అవినీతి అంతం సాధ్యమేనా
ఈ స్థితిలో కాలానికి ఎదురీదడం, సమాజంలో అంతర్భాగంగా పేరుకుపోయిన అవినీతి రుగ్మతను అరికడతాననడమే సాహసం. అవినీతి ఊసెత్తడమంటేనే నేటి నాయకులకు భయం. విష సర్పంలా పడగలు విప్పి బుసలు కొడుతున్న దాని జోలికెళ్లాలంటేనే జడుపు. అది తమనెక్కడ కాటేస్తుందోననే భయం. అందులోనూ ప్రజాస్వామ్యం అంటేనే అత్యంత ఖరీదైన అవినీతి యజ్ణంలా మారిపోయింది. అందుకే ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్లుగా మారిపోయింది తంతు.ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు, అవినీతి శ్రేణిలోనూ మొదటివరసలోనే నిలుస్తోంది. తాజాగా తీసుకున్న అవినీతి గణాంకాల అంచనాల్లో దేశంలోనే నాలుగో పెద్ద అవినీతి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. పదకొండు ప్రజాసర్వీసులను ప్రాతిపదికగా తీసుకుంటే ప్రతి పనిలోనూ పగ్గాల్లేని కమీషన్లు దండుకుంటున్నట్లుగా తేలింది. ప్రజారోగ్యం, పౌరసరఫరాలు, విద్య, రిజిస్ట్రేషన్లు, రవాణా, మునిసిపల్, తాగునీరు, విద్యుత్తు అన్నిటా పర్సంటేజీలు పక్కాగా అమలవుతున్నట్లు ప్రజాభిప్రాయం చాటిచెప్పింది. 73శాతం ప్రజలు అవినీతి లేనిదే పని కావడం లేదంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. కడుపేదలకు , వ్యవసాయ కూలీలకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకంలోనూ అవినీతి పాళ్లున్నాయంటే కరప్షన్ తీవ్రత కళ్లకు కడుతుంది. వేలాది ప్రజల సాక్షిగా తీసుకున్న ప్రమాణాన్ని పక్కన పెట్టేయకుండా ప్రతి శాఖ సమీక్షలోనూ అవినీతి అంశాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించడం ముదావహం. ప్రజల జీవితాలపై కరాళ న్రుత్యం చేస్తున్న కరప్షన్ నిర్మూలనకు కట్టుబడి ఉన్నానని ప్రభుత్వాదినేత ప్రతి సందర్భంలోనూ గుర్తు చేసుకోవడం అధికారులకు స్పష్టమైన సంకేతాలనే అందిస్తుంది అరివీర భయంకరమైన ప్రజామద్దతు కలిగిన నాయకులు తప్ప ఇటువంటి ప్రకటనలు చేయలేరు. వ్యవస్థలో మార్పు తేవాలంటే ప్రతిఘటన ఎదురవుతుంది. సన్నాయి నొక్కులు, నిరసన సెగలు, అసంతృప్త జ్వాలలు, ఆందోళనలు వెల్లువెత్తుతాయి. స్వార్థశక్తులు నాయకత్వ నిర్ణయాన్ని బలహీనపరచాలని శతధా , సహస్రధా ప్రయత్నిస్తుంటాయి. సాదాసీదా నాయకులకు దానిని సర్దిపుచ్చడం సాధ్యం కాదు. సమాధానం చెప్పడమూ సులభం కాదు. అశేష ప్రజానీకం తనకు అండగా ఉంటుందనే నిండైన విశ్వాసం, గుండె నిండుగా భరోసా ఉంటేనే అది సాధ్యం. ఈవిషయంలో జగన్ మోహన్ రెడ్డి నమ్మకం ప్రజాతీర్పు రూపంలో ప్రత్యక్ష నిదర్శనంగా సాక్షాత్కరిస్తోంది. అటు ఇటు చూపుల్లేకుండా, సంశయ,సందేహ,శషభిషలకు తావే లేకుండా అయిదు కోట్ల ఆంధ్రులు తమ అధినేతగా చరిత్రాత్మక విజయాన్ని ప్రసాదించారు. ప్రజాసమూహంలోనే జన నాయకుడి బలం దాగి ఉంటుంది. ఆ తీర్పే అవినీతిపై సమరశంఖారావానికి ప్రేరణ అయి ఉంటుంది. అందుకేనేమో పదవీ స్వీకార ప్రమాణ వేదికపై నుంచే అవినీతి నిర్మూలనే తన ప్రథమ ప్రాధాన్యమంటూ స్పష్టం చేశారు. కరప్షన్..కరప్షన్…కరప్షన్ అంటూ చెలరేగిపోతున్న ప్రభుత్వ యంత్రాంగ భూతానికి పగ్గాలు వేయడం చిన్నాచితకా విషయం కాదు.రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్లపై స్వారీ చేస్తుంది. ఇంతవరకూ జరిగిందదే. దాన్నుంచి బయటపడి రుజుమార్గంలో సర్కారీ రథాన్ని పరుగులు తీయించాలి. అందుకు మనసా వాచా కర్మణా దీక్షాదక్షతలుండాలి. అవినీతిని అదుపు చేయడమంటే ఎందుకంతగా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది?. నిజాయతీ నెల కొల్పడమంటే ఎందుకు నోరు వెళ్లబెట్టాల్సి వస్తోంది?. చేసిన పనికి జీతం కంటే గీతమే ఎందుకు ముఖ్యమనుకుంటున్నారు?ఇందుకు చాలా కారణాలున్నాయి. ఏళ్ల తరబడి పేరుకుపోయిన నాయకుల ఉదాసీనత, నిర్లక్ష్యం, నేతలు సైతం కుమ్మక్కు కావడం వంటి సవాలక్ష జవాబులు దొరుకుతాయి. నరనరాన, కణకణాన అవినీతి రుగ్మత పాకిపోవడంతోనే నిర్మూలన సాధ్యమా? అన్న ప్రశ్న ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది.ఏదో పైపై మందులకు, మాటలకు లొంగే జబ్బు కాదిది. సమూల శస్త్రచికిత్స అవసరం. ఒడిదుడుకులు, సొంత శరీరం వంటి ప్రభుత్వాన్నే కష్ట పెట్టాల్సిన క్షణాలు ఉంటాయి. కానీ శాశ్వత స్వస్థతకు, స్వచ్ఛ పాలనకు అది తప్పనిసరి. ఒత్తిడులకు, ఆశ్రితపక్షపాతానికి, రాజకీయ అవసరాలకు తావివ్వకుండా …ఇదే సంకల్పంతో ముందడుగు వేస్తే…అశేష ప్రజానీకం అండగా నిలుస్తుంది.. హారతులు పడుతుంది…అన్నార్తులు, అభాగ్యులు, అసహాయుల ఘోష తీరుతుంది. గోడు నెరవేరుతుంది. అందుకు ఇదే సరైన తరుణం.