మధుయాష్కీ... కిం కర్తవ్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మధుయాష్కీ... కిం కర్తవ్యం


హైద్రాబాద్, జూన్ 24, (way2newstv.com)
ఆయన జాతీయ స్ధాయి రాజకీయాల్లో యాక్టివ్ పార్టీ అధినేతకు చాలా క్లోజ్ కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యారు. రెండు సార్లు ఎంపీగా గెలిచి రెండు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఓటమి పాలైన ఆ మాజీ ఎంపీ, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆ నియోజకవర్గాన్ని ఇక వదిలేస్తారా ఆ నియోజకవర్గమే బెటర్ అని ఉండిపోతారా ఒకవేళ అక్కడే ఉంటే ఆ జిల్లా క్యాడర్ సదరు మాజీ ఎంపీకి సహకరిస్తుందా ఈ అనుమానాలు హస్తం నేతను వెంటాడుతున్నాయి. ఇంతకీ ఆ మాజీ ఎంపీ ఎవరు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి...? ఇందూరు రాజకీయాల్లో, ఓ వెలుగు వెలిగి జాతీయ స్ధాయిలో గుర్తింపు పొందిన రాజకీయ నేత మధుయాష్కీ. ఎన్.ఆర్.ఐగా జిల్లాలో అడుగుపెట్టి వరుసగా రెండు సార్లు ఎంపీగా జిల్లాను ఏలిన నాయకుడు. వరుసగా రెండుసార్లు ఎంపీగా ఓడిపోయారు. ఆయన ఓడిపోయిన ప్రతీ సందర్భంలో జిల్లాకు ముఖం చాటేస్తారనేది విమర్శ. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓటమిపాలయ్యారు. 


మధుయాష్కీ... కిం కర్తవ్యం
కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా జిల్లా ప్రజలు ఆయన్ను ఓడించారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్ధకంలా మారింది.  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితునిగా ఉండే, మధుయాష్కీకి పొలిటికల్ గా మరింత గడ్డు పరిస్ధితి ఎదురవుతోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నామమాత్రంగా పోటీ ఇచ్చిన మధుయాష్కీ, అసలు మళ్లీ పోటీ చేయడమెందుకని, పార్టీ క్యాడర్ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు సొంత పార్టీలోనే శత్రువులు ఎక్కువయ్యారు. ఆయన మళ్లీ జిల్లాకు వస్తే సహకరించేందుకు సైతం సిద్దంగా లేరు. రెండు పర్యాయాలు ఎంపీగా చేసినా, సొంత క్యాడర్‌ తయారు చేసుకోలేకపోయారు. ఒకరిద్దరు నేతల మినహా తనకంటూ ప్రత్యేక సైన్యం రూపొందించుకోలేదు. దీంతో మధుయాష్కీ జిల్లా నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచినా, నాన్ లోకల్‌గానే మిగిలిపోయారని హస్తం నేతల వాదన. ఎన్నికల సమయంలో వస్తారనే అపవాదు సైతం ఆయన్ను వెంటాడుతోంది. నిజామాబాద్ జిల్లాలో మధుయాష్కీకి, ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో తెలియదు కానీ, సొంత పార్టీలో చాలామంది ఆయన తీరు నచ్చనివారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల సమయంలో వస్తారు మిగతా సమయాల్లో అందుబాటులో ఉండరని, అలాంటప్పుడు ఇక్కడి నుంచి పోటీ చేయడమేందుకని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. మధుయాష్కీ జిల్లాను విడిచి వెళితే హస్తం పార్టీ మరింత బాగు పడుతుందని కొందరు సీనియర్లు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి, కాంగ్రెస్ క్యాడర్ సపోర్ట్ చేయడానికి, మధుయాష్కీ వైఖరే కారణమంటున్నారు పార్టీ క్యాడర్. జిల్లా మార్పుపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే రాజకీయ భవిష్యత్తు మరింత బాగుంటుందని ఆయన సన్నిహితులు సూచిస్తున్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్ధానంలో కాంగ్రెస్ పార్టీకి 69వేల ఓట్లు రావడమంటే, కాంగ్రెస్ పొటీచేసిన 17 నియోజకవర్గాల్లో నిజామాబాద్ మినహా ఇంత దారుణమైన ఫలితాలు మరెక్కడా రాలేదని ఆయన అనుచరులు మధన పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో సింగిల్ డిజిట్ ఓట్లు మాత్రమే రావడం పట్ల ఆయనపై పెరిగిన వ్యతిరేకత కారణంగా చెబుతున్నారు ద్వితీయశ్రేణి నేతలు. ఏది ఏమైనా ఊహించని ఫలితాలతో షాక్ నుంచి మధుయాష్కీ ఇంకా తేరుకోలేకపోతున్నారు. జిల్లాకు సైతం ముఖం చాటేయడంతో, ఆయన నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండుసార్లు నిజామాబాద్ పార్లమెంట్‌లో ఓడిపోవడంతో, ఆయన ఇక్కడే ఉంటారా లేదా వేరే నియోజకవర్గం షిప్ట్ అవుతారా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ కోమటిరెడ్డి బీజేపీలోకి వెళితే, మధుయాష్కీ భువనగిరి షిప్ట్ అవుతారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల అనంతరం మధుయాష్కీ మౌనంగా ఉండటం వెనుక అసలు కారణం ఏంటో తెలియక ఆ పార్టీ క్యాడర్ తలలు పట్టుకుంటోంది. దేశవ్యాప్త ఫలితాలతో, మధుయాష్కీ పరిస్ధితి ఇంకా డోలాయమానంలోనే ఉంది. ప్రస్తుతానికి మరో ఏడాది వరకు సైలెంట్‌గా ఉండటమే బెటర్ అనుకుంటున్నారట ఆ మాజీ ఎంపీ. ఐతే జులై నెలలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండంటతో, నిజామాబాద్ జిల్లాలో మళ్లీ యాక్టివ్ రోల్ పోషించి క్యాడర్‌లో భరోసా నింపుతారా? లేక సైలెంట్‌గా సైడ్ అయిపోతారా అన్నది రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది.