ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. తాను చేయాలని అనుకున్న పనికి ఎలాంటి ప్రచారం లేకుండా చేసేస్తున్నారు. ఇలా కూడా ఓ ప్రభుత్వం చేయగలదా? అనే రేంజ్‌లో జగన్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లిలో గత సీఎం చంద్రబాబు ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న ప్రజావేదికను రాత్రికి రాత్రి కూల్చివేశారు. దీనికి సంబందించి జగన్ చెబుతున్న ప్రధాన విషయం.. నదీ పరీవాహకానికి సంబందించిన గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, నిబంధనలను చంద్రబాబు తుంగలో తొక్కారని, అధికారులు సైతం దీనికి అనుమతించలేదని జగన్ పేర్కొన్నారు.దీనికి ఎవరూ అడ్డు చెప్పడం లేదు. అయితే, ఇక్కడే కొన్ని ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. ఇదే కృష్ణానది కరకట్టపై.. దాదాపు రెండు దశాబ్దాల కిందటే.. చాలా మంది రాజకీయ నాయకులు బహుళ అంతస్థుల్లో కట్టడాలు కట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు.
జగన్ దూకుడు వెనెక...
ఇక్కడే అనేక మంది స్వాములు మఠాలను ఏర్పాటు చేసుకున్నారు. మరి వీరి మాటేంటి? చంద్రబాబు నిర్మించిన కట్టడమే నిబంధనలకు విరుద్ధమని భావిస్తున్నప్పుడు .. మిగిలిన భవనాలు కూడా నిబంధనలకు విరుద్ధమే కదా! అలాంటి సమయంలో వాటిని కూడా కూల్చి వేయాలి కదా! అనేది తెరమీదకు వచ్చిన ప్రధాన ప్రశ్న.దీనిపై ప్రభుత్వం ఒకింత క్లారిటీ ఇస్తోంది. ముందు ప్రభుత్వ పరంగా తాము తప్పు చేస్తూ. ఎదుటి వారికి నీతులు చెప్పే పరిస్థితి లేదుకాబట్టి.. ప్రజావేదికను ముందు కూల్చివేసి, తర్వాత మిగిలిన కట్టడాలకు సంబందించి కూడా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. కట్ చేస్తే.. ఇక్కడే జగన్ చిక్కుల్లో కూరుకుపోయే ఛాన్స్ ఉంది. కరకట్టను ఆనుకుని రెండు దశాబ్దాల కిందటే నిర్మించిన భవనాలు అంత ఆషామాషీ వ్యక్తులవి కావు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా చాలా బలమైన వ్యక్తులే ఇక్కడ వాటిని ఏర్పాటు చేశారు. వీరికి దేశంలోని పెద్దపెద్ద నాయకులతో నేరుగా టచ్ ఉంది.మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త గోకరాజు గంగరాజు, ప్రముక ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ రాజు, ప్రముఖ పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి, విశాఖ శారదా పీఠానికి సంబంధించిన ఆశ్రయం.. ఇలా అనేక మంది పెద్ద తలకాయల సంస్థలే ఇక్కడ పోగుపడ్డాయి. వీటిని కదిలించే సాహసం చేస్తే.. నేరుగా కేంద్రం నుంచి జగన్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి రావడం ఖాయం. ఎందుకంటే.. వీరంతా కేంద్రంలోని బీజేపీకి ఆత్మీయులు! సో.. మరి జగన్ వీరిని టార్గెట్ చేస్తే.. ఖచ్చితంగా అది బీజేపీని టార్గెట్ చేసినట్టే అవుతుంది! ఎలా ముందుకు వెళ్తాడో చూడాలి