ఒక్కసారిగా పెరిగిన జగన్ క్రెడిబులిటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఒక్కసారిగా పెరిగిన జగన్ క్రెడిబులిటీ


అమరావతి, జూన్ 24, (way2newstv.com)
ఆయనకు వయసేముంది. రాజకీయ అనుభవం ఏముంది. నైతిక విలువలు మా సొత్తు. మేము అంతటి వాళ్ళం, ఇంతటి వాళ్ళం. ఇలా జబ్బలు చరచుకునే వాళ్ళంతా ఇపుడు జగన్ని ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు. ఇక కేంద్రంలో బీజేపీ కూడా మడి వదిలేసి మరీ నలుగురు టీడీపీ ఎంపీలను విలీనం పేరిట గోడ దాటించేశాక జగన్ మోహన్ రెడ్డి విలువ మరింతగా పెరిగింది. ఇటు చూస్తే తెలంగాణాలో కేసీయార్ యధేచ్చగా ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరినీ తన వైపునకు లాక్కున్నారు. కేంద్రంలో నీతివంతమైన పాలన అందిస్తామని చెప్పిన బీజేపీ కూడ నెల రోజులు కూడా తిరక్కుండానే కట్టుబాట్లు వదిలేసింది.తొలి అసెంబ్లీ జరిగిన వేళ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో నిండు సభలో ఓ కచ్చితమైన హామీని ఇచ్చారు. 


ఒక్కసారిగా పెరిగిన జగన్ క్రెడిబులిటీ
తాను ఏ ఒక్క ఎమ్మెల్యే ను ఇతర పార్టీల నుంచి తీసుకోబోనని స్పష్టంగా చెప్పేశారు. తానే కాదు ఏ పార్టీ వారు అయినా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా కూదా వారిని వెంటనే అనర్హులను చేయాలని కూడా జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ ను కోరారు. స్పీకర్ ఈ విషయంలో పూర్తి అధికారాలతో వ్యవహరించవచ్చునని కూడా అన్నారు. ఆ విధంగా జగన్ మోహన్ రెడ్డి దేశానికే ఓ మంచి సందేశాన్ని పంపించారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని, అది మంచి దిశగా సాగాలని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి జగన్ నీతిగా ఉంటే ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు ఏపీలో వచ్చిన బీజేపీ ఇప్పుడు ఇలా టీడీపీ ఎంపీలను తీసుకోవడం విలీనం డ్రామా ఆడడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న ఉదయిస్తోంది.ఇంతటితో బీజేపీ ఆగుతుందని కూడా ఎవరూ అనుకోవడంలేదు. టీడీపీ ఎమ్మెల్యేలను కూడా లాగేందుకు ఆ పార్టీ గట్టిగా కృషి చేస్తుందని అంటున్నారు. ఓ విధంగా టీడీపీ మూలాలు లేకుండా ఏపీలో చేయాలన్నది కమలనాధుల అజెండాగా కనిపిస్తోంది. అదే సమయంలో తాము ఏపీలో అధికారంలోకి రావాలని కూడా బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. దానికోసం ఫిరాయింపులనే మార్గంగా చేసుకుంటోంది. మరి ఏపీలో ఫిరాయింపులు జరిగితే ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి. ఏది ఏమైనా రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అన్న మాటలకు జగన్ మోహన్ రెడ్డి వంటి యువ నాయకుడు కట్టుబడి ఉండడం ఓ వైపు కనిపిస్తే, దశాబ్దాల రాజకీయ అనుభవం, విలువలతో కూడిన తేడా పార్టీలు అని చెప్పుకునే వారే నీతిని గోతుల్లోకి పాతేయడం మాత్రం దేశవ్యాప్తంగా చర్చగా ఉంది.