ధోని ఇంట్లో దొంగతనం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ధోని ఇంట్లో దొంగతనం


అడ్డంగా బుక్కైన దొంగలు
న్యూఢిల్లీ, జూన్ 7, (way2newstv.com)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంటితో పాటు పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. ధోనీకి నోయిడాలోని సెక్టార్ 104లో ఒక ఇల్లు ఉంది. దాన్ని ఆయన విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. ఈ ఇంట్లో కొన్ని రోజుల క్రితం దొంగతనం జరిగింది. మరమ్మత్తులు జరుగుతోన్న ఈ ఇంట్లో నుంచి ఖరీదైన ఎల్‌ఈడీ టీవీని దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో విక్రమ్ సింగ్ పోలీసులను ఆశ్రయించారు. 


ధోని ఇంట్లో దొంగతనం
ధోనీ ఇల్లు ఉన్న ప్రాంతంలోనే మరిన్ని చోరీలు జరిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తొమ్మిది బ్యాటరీలు, మూడు ఇన్వెర్టర్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, ఐదు ఎల్‌ఈడీ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రాహుల్, బబ్లూ, ఇక్బాల్‌గా పోలీసులు గుర్తించారు. వీరు ఓ ఇంట్లో నుంచి డిజిటల్ వీడియో రికార్డర్‌ను కూడా చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. దొంగతనానికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా ఈ డిజిటల్ వీడియో రికార్డర్‌ను వారు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వివరించారు. కాగా, ధోనీ ఇంట్లో ఎల్‌ఈడీ టీవీని ఎత్తుకెళ్లిన ఈ దొంగలకు అది ఆయన ఇల్లని తెలియదని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లలో దొంగతనాలు చేసుకుంటూ పోయారని, ఈ క్రమంలో ధోనీ ఇంట్లో టీవీని కూడా ఎత్తుకెళ్లారని చెప్పారు. అంతేకానీ, వారు కావాలని ధోనీ ఇంటిని టార్గెట్ చేయలేదని వివరించారు.