కాపు కోసం కమలం గాలం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాపు కోసం కమలం గాలం


ఏలూరు, జూన్ 24, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాగైనా బలపడాలని కమలం పార్టీ తెగ తంటాలు పడుతోంది. ఏనుగు లాంటి పార్టీ టీడీపీ తాజా ఎన్నికల్లో కుదేలై ఎలకపిల్లగా మారిపోయింది. దాంతో ఆ పార్టీని దాటేసి ముందుకు రావాలన్నది కాషాయధారుల గట్టి సంకల్పం ఏపీలో. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, టీడీపీకి ఇక కాలం చెల్లిపోయిందని ఓ వైపు కమల దళం ప్రచారం చేస్తోంది. మరో వైపు అయిదేళ్ళ పాటు అధికార వియోగం అనుభవించాలనో, లేక కేసులు, వేధింపుల భయమో తెలియదు కానీ టీడీపీలోని చాలా మంది చూపు బీజేపీ మీద ఉంది. ఎలాగూ ఏ పార్టీ శాశ్వతం కాదు, అధికారంలో ఉన పార్టీ వైపుగా అడుగులు వేస్తే బాగుంటుందన్న వారి జాబితా కూడా బాగా పెరుగుతోంది. దీన్ని అవకాశంగా తీసుకుని కమలనాధులు రంగంలోకి దిగిపోతున్నారు.ఇక ఏపీ విషయానికి వస్తే మాజీలకే ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ మేధావులు ఆలోచన చేస్తున్నారుట. 


కాపు కోసం కమలం గాలం
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే సభ్యత్వం కోల్పోతారు. పైగా ఇక్కడ వైసీపీ అధికారంలో ఉంది. సీఎమ్ జగన్ సైతం ఫిరాయింపులకు ఎవరు పాల్పడినా కూడా స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని నిండు అసెంబ్లీ సాక్షిగా కోరారు. దాంతో ఏపీలో బీజేపీ వైపు వెళ్ళాలనుకుంటున్న ఎమ్మెల్యేలకు ఇప్పట్లో అది కుదిరే వ్యవహారం కాదు. ఇక ఓ పెద్ద గ్రూప్ గా ఎమ్మెల్యేలు ఏర్పడి విలీనం ప్రస్తావన తెస్తే అపుడు ఏమవుతుందన్నది కూడా డౌటే. పార్టీలో వేరుపడిన పెద్ద గ్రూప్ అయినా కూడా గుర్తించాల్సింది స్పీకరే. ఆయన విచక్షాణాధికారం ఉపయోగించి వేటు వేస్తే అపుడు పరిస్థితి ఏంటి. ఈ రకమైన సందేహాలతో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను ప్రస్తుతానికి బీజేపీ పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. దాంతో మాజీలనే తీసుకోవాలనుకుంటోందట.ఏపీలో కాపులు బలంగా ఉన్నారు. వారి ప్రభావం దాదాపుగా 70 వరకూ అసెంబ్లీ సీట్లతో ఉంది. ఏ పార్టీ ఏపీలో అధికారంలోకి రావాలన్నా కాపులే ముఖ్యం. గతసారి టీడీపీ గెలిచినా ఈసారి వైసీపీ విజయం సాధించినా కాపుల ఓటే కీలకం అయింది. దాంతో రేపటి ఎన్నికల్లో ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ కాపులను నమ్ముకుంటోంది. టీడీపీలో మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న కాపులను దువ్వుతోంది. వారిని గీత దాటించి తమ పార్టీలో చేర్చుకుంటే స్థానికంగా పార్టీ పటిష్టం అవుతుంది, అదే సమయంలో టీడీపీ కి కూడా గట్టి షాక్ తగులుతుందని భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, కాపు కులానికి చెందిన నాయకులు ఈ మధ్య సమావేశమై భవిష్యత్తు సమాలోచనలు జరిపారు. మరి వారు బీజేపీ వైపు మళ్ళెతే మాత్రం ఏపీ రాజకీయాల్లో మార్పు రావడం ఖాయం.