ఇంటింటికి రేషన్ కోసం ఏర్పాట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇంటింటికి రేషన్ కోసం ఏర్పాట్లు


తిరుపతి, జూన్ 29, (waay2newstv.com
ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు కళ్లెం వేసి.. లబ్ధి దారుల ఇంటి వద్దకే రేషన్‌ అందించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంకల్పించింది. అదే సమయంలో నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని యోచిస్తోంది. జిల్లాలో 2,877 చౌక దుకాణాలు ఉన్నాయి. ఈ షాపుల కింద మొత్తం 11,07,886 రేషన్‌కార్డులు ఉన్నాయి. 2016లో అక్రమాలకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ–పాస్‌ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. అయితే ఈ విధానం ద్వారా అక్రమాలకు చెక్‌ పడలేదు. పైగా కార్డుదారులను ఇబ్బందులకు గురిచేశారు. ఆధార్‌ లింక్, వేలిముద్రలు, ఐరిష్‌ ఇలా సవాలక్ష సమస్యల పేరుతో కార్డుదారులకు సరుకులు అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కార్డుదారులు ప్రతినెలా సరుకులు తీసుకునేందుకు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని మొత్తం కార్డుదారుల్లో 1.10 లక్షల మంది మాన్యువల్‌గా రేషన్‌ తీసుకుంటున్నారు. 90 శాతం మంది కార్డుదారులు తీసుకుంటుండగా, 10 శాతం మంది రేషన్‌ తీసుకోవడానికి రావడం లేదు. 

ఇంటింటికి రేషన్ కోసం ఏర్పాట్లు

8 వేల మంది కార్డుదారులకు వివిధ కారణాల వల్ల వారి వేలిముద్రలు ఈ–పాస్‌ యంత్రం తీసుకోవడం లేదు. సింగిల్‌ కార్డు ఉన్న వారి వేలిముద్రలు యంత్రంలో సరిపోవడం లేదు. ఇలా సుమారు 8 వేల మంది కార్డుదారులకు నెలనెలా సమస్యలు వస్తున్నాయి. వృద్ధులు, బయోమెట్రిక్‌ నమోదు కానీ వారికోసం సంబంధిత ఎన్‌ఫోర్సుమెంట్‌ డిప్యూటీ తహసీల్దార్లు, ఆహార తనిఖీ అధికారులు, ఏఎస్‌ఓలు దుకాణం పరిధిలో ఈ తరహా  కార్డుదారులందరినీ ఒక విడతలో పిలిచి వారికి సంబంధిత అధికారి వేలిముద్ర వేసి సరుకులను ఇస్తున్నారు.ఈ విధానంలో అధికారికి తీరిక దొరికినప్పుడు మాత్రమే సరుకులను తీసుకెళ్లాలి. అధికారికి ఎప్పు డు ఖాళీ దొరుకుతుందో సమాచారాన్ని సంబంధిత చౌక ధరల దుకాణదారునికి తెలియజేస్తారు. కొందరు వృద్ధులు సరుకులను తీసుకెళ్లడానికి ఓపిక లేక దుకాణాల వైపు రావడం లేదు. ఈ తరహా సమస్యలతో 10 శాతం కార్డుదారులు జిల్లా వ్యా ప్తంగా సరుకులను తీసుకెళ్లడం లేదని అధికారుల రికార్డులతో తెలుస్తోంది. ఎన్నికల వేళ డీఎస్‌ఓ పర్యవేక్షణలో వృద్ధులకు బయోమెట్రిక్‌ పడని వారికి సరుకులను వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. ఒకటి, రెండు రోజులు తూతూమంత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చేతులు దులుపుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందుకు భిన్నంగా కార్డుదారుని ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు వచ్చే విధంగా వ్యవస్థను రూపకల్పన చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.జిల్లాలో 28 ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు ప్రతి నెలా 18,864.90 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేస్తోంది. అదే చక్కెర 600.22, రాగులు 3,315.81, కందిపప్పు 2,227.35 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేస్తోంది. బియ్యం ఇలా బస్తాల్లో చేరుతున్నాయి. అక్కడ తూకాలు వేసి కార్డుదారులకు తలసరి ఐదు కిలోల లెక్కన కంది పప్పు రెండు కిలోలు, చక్కెర అరకిలో ఇస్తున్నారు. ఇందులోనూ కోత విధిస్తున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో, దుకాణాల్లో తూకాల్లో తేడాలు వస్తున్నాయి.  వినియోగదారులు బాగా నష్టపోతున్నారు. బియ్యం పక్కదారి పడుతోంది. సరుకుల అక్రమ తరలింపు జరుగుతోంది. వీటిని అడ్డుకోవడానికి విజిలెన్స్‌ తనిఖీలు చేయాల్సి వస్తోం ది. మరోవైపు దుకాణదారులు, ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం లాలూచీ పడి సబ్సిడీ సరుకుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వీటిని నిరోధించేందుకు ప్రభుత్వం ప్రజా పంపిణీలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. రేషన్‌ సరుకులన్నీ ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకుంది.కార్డుదారులకు ఇస్తున్న బియ్యంలో నాణ్యత ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతానికి రకరకాల బియ్యం చౌక దుకాణాల నుంచి పంపిణీ చేస్తున్నారు. కొత్త బియ్యం, స్వల్పకాలిక పంటలు కావడంతో అన్నం పిండి అవుతోంది. అందుకే కొందరు ఈ రకాలను ఇష్టపడం లేదు. ఈ బియ్యమే తిరిగి రీసైక్లింగ్‌ చేసి బహిరంగ మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో నాణ్యమైన బియ్యం కార్డుదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం తలచింది.రేషన్‌ బియ్యాన్ని ఇక నుంచి 5, 10, 20 కిలోల ప్యాకెట్లుగా తయారుచేసి పౌరసరఫరాల శాఖ పంపిణీ చేయనుంది. గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ ప్యాకెట్లను సరఫరా చేస్తారు. కార్డులో ఒక లబ్ధిదారుడే ఉంటే ఐదు కిలోలు, ఇద్దరు ఉన్న కార్డుకు 10 కిలోలు, ముగ్గురు ఉన్న కార్డులకు 15 కిలోల ప్యాకెట్లు, నలుగురు సభ్యులుంటే  20 కిలోల ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. వీటితో పాటు ఐదు రకాల నిత్యావసర సరుకులు అందజేస్తారు. చక్కెర, కందిపప్పు, ఉప్పు, పామాయిల్, గోధుమ పిండి ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాగులు, జొన్నల పంపిణీ పరిశీలనలో ఉంది. యంత్రాల ద్వారా తూకాలు వేసి ప్యాకెట్ల రూపంలో ప్రజలకు పంపిణీ చేస్తారు. బియ్యం ప్యాకెట్లు తయారు చేయడానికి 35 కేంద్రాలను నెలకొల్పాలని ప్రాథమికంగా అంచనా వేశారు. సెప్టెంబర్‌ ఒకటి నుంచి ఈ విధానంలో సరుకులను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు