అరకొర సౌకర్యాలతో సంగీత కళాశాల - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అరకొర సౌకర్యాలతో సంగీత కళాశాల


విజయనగరం, జూన్ 10, (way2newstv.com)
విద్యార్థుల నుంచి వేలల్లో  ఫీజులు వసూలు చేస్తున్న విశ్వ విద్యాలయాలు పరీక్షలుమాత్రం అరకొర సౌకర్యాలతో మమ అనిపిస్తున్నాయి. పరీక్ష రాయడానికి కనీసం బల్లలు లేవు...కూర్చోవడానికి కుర్చీలు లేవు... ఇది ప్రస్తుతం జరుగుతున్న సంగీత పరీక్షల నిర్వహణ తీరు. విజయనగరం మహారాజ ప్రభుత్వ సంగీత న్రుత్య కళాశాలలో సంగీతం న్రుత్య విభాగాలకు సంబంధించి థియరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి, తొలి రోజు సర్టిఫికేట్  తరువాత రెండు రోజులు డిప్లమో  థియరీ పరీక్షలు జరుగుతాయి.  విజయనగరం సంగీత కళాశాల విద్యార్థులతో పాటు శ్రీకాకుళం , విశాఖపట్నం జిల్లాలవారు ఇక్కడే పరీక్షలు ఎక్కువ గా రాస్తున్నారు. వీరితో పాటు ఒడిషా లో కూడా సంగీతం నేర్చుకున్న విద్యార్థులు కూడా ఆదే కేంద్రం లో పరీక్షలకు వస్తుంటారు.


 రకొర సౌకర్యాలతో సంగీత కళాశాల
భాషా సాంస్క్రుతిక శాఖ ఆధ్వర్యంలో తెలుగు విశ్వ విద్యాలయం నాలుగేళ్ల సర్టిఫికేట్, ఆరేళ్ల డిప్లమో కోర్సులకు పరీక్షలు నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు థియరీ, 9 నుంచి 15 వరకు  ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే  పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులకు మాత్రం ఎటువంటి సౌకర్యాలు కానరావడం లేదు.నేలపైనే కూర్చొనే పరీక్షలు రాయాల్సిన పరిస్థితి. సంగీతానికి సంబంధించిన పరీక్షలకు గరిష్ట వయోపరిమితి లేకపోవడం వల్ల  పెద్ద వాళ్లు సైతం పరీక్షలు రాస్తున్నారు. మూడు గంటలపాటు కూర్చుని పరీక్షలు రాయాల్సి రావడంతో వారెంతో ఇబ్బందులు పడుతున్నారు.  ఈ ఏడాది 187 మంది సర్టిఫికేట్ , 69 మంది డిప్లమో పరీక్షలు రాస్తున్నారు. వీటికి తెలుగు విశ్వ విద్యాలయం ఫీజులు కూడా భారీగానే వసూలు చేస్తోంది. సర్టిఫికేట్ పరీక్షకు 2200 , డిప్లమోకు 2450 రూపాయలు వసూలు  చేస్తున్నారు. ఇక పరీక్ష రాసేందుకు తమ పిల్లలను తీసుకు వచ్చే తల్లిదండ్రులకు కష్టాలు తప్పడం లేదు. పరీక్ష పూర్తయ్యే వరకు ఆరుబయట ఎండలో పడిగాపులు పడుతున్నారు. ప్రస్తుతం సంగీత కళాశాలకు మరమ్మతులు చేపడుతున్నారు.  కచేరీ హాలుతో పాటు , ఇతర తరగతి గదులలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశారు. తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అయితే పరీక్షలు రాసేందుకు అవసరమైన కుర్చీలు బల్లలు మాత్రం కళాశాలలో లేవు.  అవసరమైతే వీటిని బయట నుంచి అద్దె ప్రాతిపదిక తీసుకురావాల్సిందే. అలా తేవడానికి తెలుగు విశ్వ విద్యాలయం నుంచి ఎటువంటి  నిధులు మంజూరు లేకపోవడంతో కళాశాల నిర్వాహకులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేసే విశ్వ విద్యాలయం పరీక్షల నిర్వహణలో కనీస సౌకర్యాలు కల్పించాలని అంతా కోరుకుంటున్నారు.