ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం రావడంతో ప్రధానంగా ఇబ్బంది పడేవారిలో తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఒకరని చెప్పకతప్పదు. సీఎం రమేష్ ప్రముఖ కాంట్రాక్టరు. ఆయన దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటూ వస్తున్నారు. ఆయన కంపెనీ రిత్విక్ కనస్ట్రక్షన్ ఏపీలో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల కాంట్రాక్టును దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక కాంట్రాక్టు పనులను చేపట్టింది. గండికోట రిజర్వాయర్ మొదలుకుని హంద్రీనీవా, పోలవరం ప్రాజెక్టుల్లో కొన్ని పనులను సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కనస్ట్రక్షన్స్ పనులను చేస్తుంది.చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రమేష్ కు రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
సీఎం రమేష్ కు ఇక చుక్కలే
గండికోట రిజర్వాయర్ పనులు నాసిరంకగా, మందకొడిగా చేశారని అప్పట్లో చంద్రబాబునాయుడు సమీక్షలో ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు అనేక ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ కాంట్రాక్టును కూడా దక్కించుకున్నారు. కడప, అనంతపురం జిల్లాల్లోనూ సీఎం రమేష్ కు అక్కడి టీడీపీ ప్రజాప్రతినిధులకు మధ్య కాంట్రాక్టుల విషయంలో విభేదాలు కూడా తలెత్తాయి.ఒకదశలో గండికోట రిజర్వాయర్ పనులపై ఏకంగా అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేశారు. అలాగే ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి సయితం సీఎం రమేష్ పై ఆరోపణలు చేశారు. వివిధ కాంట్రాక్టు పనులను ప్రారంభించకుండానే సీఎం రమేష్ మొబలైజేషన్ అడ్వాన్స్ లు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.పోలవరం ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టు పనులను కూడా సీఎం రమేష్ సంస్థకు అప్పగించారన్న ఆరోపణలు అప్పట్లో విన్పించాయి.ఈ నేపథ్యంలో కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కాంట్రాక్టులపైన దృష్టి సారించారు. ఇప్పటికే కడప జిల్లాలో హంద్రీనీవా పనులు, కడప జిల్లాలోని శ్రీనివాసపురం రిజర్వాయర్ కాలువ తవ్వకాల్లో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం గుర్తించింది. తొలుత అధికారులను సస్పెండ్ చేసింది. విచారణకు ఆదేశించింది. సీఎం రమేష్ టార్గెట్ గా జగన్ ప్రభుత్వం ఈ చర్యలు ప్రారంభించినట్లు స్పష్టమవుతుంది. కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రమేష్ కంపెనీ చేసిన పనులపై కూడా విచారణ జరిగే అవకాశముంది. సో…. మొత్తం మీద తెలుగుదేశం ప్రభుత్వహయాంలో ఒక వెలుగు వెలిగిన సీఎం రమేష్ కు కొత్త ప్రభుత్వం చుక్కలు చూపించడం ఖాయమంటున్నారు.