గొడ్డేటి మాధవికి బంపర్ ఆఫరేనా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గొడ్డేటి మాధవికి బంపర్ ఆఫరేనా...


విజయవాడ, జూన్ 12, (way2newstv.com)
భారీ మెజార్టీతో కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఏపీలో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ మధ్య సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైఎస్ఆర్సీపీకి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ విషయాన్ని జగన్‌కు తెలియజేశారని, అందుకు ఆయన కూడా సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. కాగా, డిప్యూటీ స్పీకర్ పదవిని గిరిజన ఎంపీకి ఇచ్చే దిశగా జగన్ యోచిస్తున్నారని సమాచారం. ఈ వార్తలు నిజమైతే.. అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని ఈ పదవి వరించే అవకాశాలు ఉన్నాయి. 17వ లోక్ సభలో పిన్న వయస్కురాలైన ఎంపీ మాధవి అనే సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో 303 స్థానాలు గెలుపొందిన బీజేపీ సొంత మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కమలనాథులకు లోక్ సభలో వేరే పార్టీ అవసరం లేదు. కానీ రాజ్యసభలో మాత్రం బీజేపీ బలం తక్కువగా ఉంది. దీంతో కీలక బిల్లులను పాస్ చేసే విషయంలో మోదీ సర్కారు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వచ్చే ఏడాది వరకూ ఇదే పరిస్థతి ఉండనుంది. 


గొడ్డేటి మాధవికి బంపర్ ఆఫరేనా...
దీంతో ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అదీగాకుండా.. మంత్రి పదవుల విషయంలో తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని జేడీయూ అలకబూనింది. బిహార్ బయట బీజేపీతో పొత్తులుండవని చెబుతోంది. దీంతో జేడీయూ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ నాయకత్వం వైఎస్ఆర్సీపీ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ పార్టీకి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసినట్టు సమాచారం.కేంద్రంలో బీజేపీతో ప్రస్తుతానికి స్నేహంగానే ఉండాలని డిసైడయిన వైసీపీ... ఆ పార్టీకి మరింతగా దగ్గరయ్యే అవకాశం లేకపోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బీహార్‌లో బీజేపీ-జేడీయూ కూటమి మధ్య విభేదాలు తలెత్తడంతో ఎన్డీయే నుంచి జేడీయూ దూరం జరగనుందనే ప్రచారం జరుగుతోంది. బీహార్‌లో జేడీయూ తమకు దూరమైతే... ఆ స్థానాన్ని వైసీపీతో భర్తీ చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే ముందుగా వైసీపీకి లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసేందుకు బీజేపీ ముందుకొచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు కేటాయించడం ఆనవాయితీ. గత లోక్‌సభలో ఈ పదవిని అన్నాడిఎంకెకు కేటాయించింది బీజేపీ. అన్నాడీఎంకెకు చెందిన తంబిదురై లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. అయితే తాజాగా ఏపీలోని వైసీపీకి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేయాలని బీజేపీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. వైసీపీ ఈ పదవిని స్వీకరిస్తారా... తీసుకుంటే ఇందుకు ఎవరి పేరును ఖరారు చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది