విజయవాడ, జూన్ 12, (way2newstv.com)
ఏపీలో జగన్ ప్రభుత్వం కొలువుదీరింది. పూర్తిస్థాయిలో సీఎం జగన్ తన కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి రెడ్డి రాజ్యాన్ని తలపిస్తుందని అనుకున్న విమర్శకుల నోళ్లకు తాళం వేస్తూ.. జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రజలకు చేరువ కావడమే పరమావధిగా ఆయన పక్కా ప్లాన్‌తో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో కీలకమైన తన కేబినెట్‌లో అత్యంత కీలకమైన వ్యక్తులకు మాత్రమే అవకాశం కల్పించారు. అదే సమయంలో రాష్ట్రంలో సామాజిక వర్గాల ప్రాధాన్యానికి రాజకీయ పార్టీలు పెద్ద పీట వేస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంలో ఖచ్చితంగా బెర్త్ ఖాయమని భావించిన కొందరికి మాత్రం నిరాశే మిగిలింది.కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి తాజా ఎన్నికల్లో విజయం సాధించిన కొలుసు పార్థసారధి(యాదవ సామాజికవర్గం) కి కేబినెట్‌లో చోటు ఖాయమని అందరూ అనుకున్నారు. గతంలో వైఎస్ హయాంలోనూ మంత్రిగా చక్రం తిప్పిన ఆయనకు అనుభవంతోపాటు వైఎస్ ఫ్యామిలీతో అనుబంధం కూడా ఉంది.
పార్థసారధి పేరు చివర్లో పక్కన పెట్టేశారు...
2014లో మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినా.. వైసీపీలో కొనసాగారు. పార్టీకి అన్ని విధాలా అండగా ఉన్నారు. తాత్కాలిక పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం తన భూమిని సైతం ఇచ్చారు. పార్టీ అదినేత పట్ల విధేయత, పార్టీ పట్ల అంకిత భావంతో కూడిన శ్రమ వంటివి పార్థసారథిని ఉత్తమమైన బాటలో నడిపించాయి.ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి టికెట్ తెచ్చుకుని, బోడే ప్రసాద్ పై హోరా హోరీ తలపడి మరీ విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆయనకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. కానీ, జిల్లాలోని సామాజికవర్గాల కూర్పులో వచ్చిన ప్లస్‌లు, మైనస్‌ల కారణంగా సారథి వెనుకబడ్డారు. కృష్ణాలో కమ్మ వర్గానికి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో కొడాలి నానికి ఇచ్చారు. ఇక, వైశ్య వర్గం కోటాలో వెల్లంపల్లి, కాపు వర్గంకోటాలో నానికి కేటాయించారు. దీంతో సారథికి అవకాశం దక్కలేదు. అయితే, అదే సమయంలో యాదవ సామాజిక వర్గానికే చెందిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌కు ఛాన్స్ దక్కింది.బీసీ వర్గాల్లో యూత్ ఐకాన్‌గా అనిల్ వ్యవహరించడం, ఆది నుంచికొంత మేరకు దూకుడు ప్రదర్శించడం వంటివి అనిల్‌కు కలిసి వచ్చింది. మంత్రి నారాయణను చిత్తుగా ఓడించడం ప్లస్‌గా మారింది. ఇక, 2014లో పార్థసారథి ఓడిపోతే.. అనిల్ మాత్రం విజయం సాధించారు. దీంతో అన్ని సమీకరణల తర్వాత నెల్లూరు నుంచి ఇద్దరికి అవకాశం ఇస్తే.. వారిలో అనిల్ ఉండడం, ఆయనకు కీలకమైన జలవనరుల శాఖను అప్పగించడం వైసీపీలో సంచలనంగా మారింది. పార్థసారథికి చివరకు విప్ తో్నే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది