మళ్లీ పెరిగిన టమోటా ధరలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ పెరిగిన టమోటా ధరలు


చిత్తూరు, జూన్ 7, (way2newstv.com)
భానుడి తాపానికి ఎగుమతులతో తగ్గిపోయిన టమోటా ధరలకు మూడురోజులుగా రెక్కలు వచ్చాయి. వారంరోజులుగా అక్కడక్కడా.. రెండురోజులుగా చిరుజల్లులు, వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో టమోటా సాగు కరువు జయిస్తోంది. ఉన్న అరాకొరా జలవనరులతో ఆరుగాలం కష్టించి పండించిన టమోటా పంట ఢిల్లీ, గోవా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, ఒడిషా, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలలో డిమాండు ఉండటంతో ధరలు కూడా రైతులకు అనుకూలంగా ఉంటున్నాయి. గత రెండురోజులుగా మదనపల్లె మార్కెట్ టమోటాకు తమిళనాడు, పాండిచ్చేరి, కేరళలలో డిమాండు పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకున్న అనంతపురం, కడప జిల్లాలో రైతులతో పాటు సరిహద్దులలో ఉన్న కర్నాటక రాష్ట్ర రైతులు సైతం పండించిన పంటను మదనపల్లె మార్కెట్ దిగుమతి చేస్తున్నారు. గత 15రోజులుగా మదనపల్లె మార్కెట్‌కు 450నుంచి 650మెట్రిక్ టన్నుల టమోటాలు దిగుమతి అవుతున్నాయి. ఇదిలావుండగా వ్యాపారుల మధ్య పోటీ పెరగడంతో అనుకూలంగా టమోటా లభిస్తుండటంతో ధరలు కూడా రైతులకు అనుకూలంగా కొనసాగుతున్నాయి. 


మళ్లీ పెరిగిన టమోటా ధరలు 
దీంతో రైతులలో టమోటా పంటలపై ఆశలు పెరుగుతున్నా ఇతరప్రాంతాల టమోటా దిగుమతి కారణంగా జిల్లా టమోటాకు ధర తగ్గుతోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని మదనపల్లె, తంబళ్ళపల్లి, పుంగనూరు, పీలేరు, పలమనేరు నియోజకవర్గాల మండలాల్లో టమోటా పంటను రైతులు అధికంగా సాగుచేశారు. 15రోజుల కితం కిలో రూ.6ల నుంచి రూ.8ల వరకు పలుకగా, ఆదివారం మదనపల్లె మార్కెట్‌లో ధరలు కిలో టమోటా రూ.12లు నుంచి రూ.15లకు పలుకడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణాలోని హైదరాబాదు, నిజామబాద్, కరీంనగర్, రాష్ట్రంలోని ఆదోని, ఒంగోలు ప్రాంతంతో పాటు దక్షిణాది రాష్ట్రాల పరిధిలో మదనపల్లె టమోటాకు డిమాండు పెరగడంతో కాయలు ఎగుమతి పెరిగింది. అంతేకాకుండా డిమాండు మేరకు కాయలు మార్కెట్‌లో లభిస్తున్నా వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. టమోటాలను జాక్‌పాట్ సిస్టం ద్వారా వ్యాపారులు కొనుగోలుకు ప్రయత్నించగా ఇందుకు రైతులు ససేమిరా అనడంతో వేలంపాటలో వ్యాపారుల మధ్య పోటీ అనివార్యమైంది. ధరలు కూడా రైతులకు గిట్టుబాటు కల్పించాయి. ఏయే ప్రాంతాలలో కాయలు డిమాండు పెరిగాయని వ్యాపారులు మండీ యాజమానులకు చెప్పకుండా ముందుగా వారికి కావాల్సిన మొదటిరకం టమోటాలు తక్కువ ధరలు పలికినా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు మాత్రం డిమాండు మేరకు వేలంపాటలో అధికధరలకు కొనుగోలుకు మొగ్గుచూపారు. దీంతో మార్కెట్‌లోని అన్ని మండీలలో ధరలు పుంజుకున్నాయి. ఇతర జిల్లాల టమోటాలను మదనపల్లె మార్కెట్‌కు రానివ్వకుండా అడ్డుకుంటే తప్ప జిల్లాలోని టమోటా రైతులకు న్యాయం జరుగుతుందని రైతులు అంటున్నారు. ధరలు ఈరోజుకు ఇలావున్నా రేపటి పరిస్థితి ఎలావుంటుందో చెప్పలేమని వ్యాపార వర్గాలు అంటున్నాయి.