ఇవాళ పూర్ణాహుతికి జగన్ హాజరు
విజయవాడ, జూలై 1, (way2newstv.com)
తాడేపల్లిలోని సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో దాదాపు రెండేళ్లుగా సాగిన మహారుద్ర సహిత ద్విసహస్ర చండీయాగం సోమవారం నాడు పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్‌కు పూర్ణకుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనీ, వర్షాలు సకాలంలో కురవాలని కోరుకుంటూ ఈ సహస్ర చండీయాగం చేపట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ నిర్వహించిన శ్రీ మహారుద్రసహిత ద్విసహస్ర చండీయాగాన్ని 2017 జులై 29న ప్రారంభించారు.
జగన్ కోసం 23 నెలల హోమం
తాడేపల్లిలో 23 మాసాలుగా కొనసాగుతున్న యాగం నేడు పూర్ణాహుతితో సంపూర్ణమైంది. వేదమంత్రోచ్ఛారణల మధ్య జగన్ చేతుల మీదుగా పూర్ణాహుతి జరిగింది. ఈ సందర్భంగా పండితులు సీఎం జగన్‌కు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం యాగంలో పాల్గొన్న పండితులకు శాలువా కప్పి, కంకణం తొడిగి జగన్ సత్కరించారు. రుద్రయాగ దీక్ష పరిపూర్ణమైన సందర్భంగా సోమవారం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. కాగా, 2019 ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ అత్యధిక మెజార్టీతో గెలుపొంది.. సీఎం పీఠం అధిష్ఠించాలని ఆకాంక్షిస్తూ మహారుద్ర సహిత సహస్ర చండీయాగాన్ని హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ నాగోల్‌లో 11 మంది పండితులు 2017 జులై 29న ప్రారంభించారు. ప్రముఖ పండితులు బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామప్రసాద్‌శర్మ, ఆయన సోదరులు నేతృత్వంలో రోజూ మహాన్యాసన పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం సహస్ర చండీపారాయణం, హోమం, మహావిద్యా పారాయణ హోమం, ప్రత్యేంగిర పారాయణ హోమం, మన్యసూక్త పారాయణ శ్రీలక్ష్మీ గణపతి జప హోమం, మహాసుదర్శన యాగం, వనగ్రహ సహిత రుద్రహోమాలు చేశారు.