25 తర్వాత మున్సిపల్ ఎన్నికలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

25 తర్వాత మున్సిపల్ ఎన్నికలు


హైద్రాబాద్, జూలై 6, (way2newstv.com)
మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఈ నెల 25 తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. 25 లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏర్పాట్లపై పురపాలక శాఖ కమిషనర్‌ శ్రీదేవితోనూ ఆయన చర్చించారు.మున్సిపాల్టీల వారీగా ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలను తెలుసుకుని వాటిని ఎలా అధిగమించాలో సూచించారు. మున్సిపాల్టీల్లో కీలకమైన పోస్టుల్లో ఇన్‌ ఛార్జ్‌ ల వ్యవస్థ లేకుండా చూడాలని జిల్లాల నుంచి అధికారులు కోరగా, వెంటనే అవసరమైన పోస్టులన్నింటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు శ్రీదేవి తెలిపారు. ఈ నెల 18 తర్వాత మరోసారి జిల్లా కలెక్టర్లతో ఎన్నికల కమిషన్‌ చర్చించి పూర్తి స్థాయి ఏర్పాట్లపై ఒక అంచనాకు రానుంది. 

25 తర్వాత మున్సిపల్ ఎన్నికలు

ఎన్నికల కమిషన్‌, పురపాలక శాఖ అధికారులు సమన్వయంతో ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్‌ లోపు ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నారు. జిల్లాలు, క్షేత్రస్థాయి నుంచి సమా చారం తెప్పించుకుంటూ ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నారు. ఒక వైపు మున్సిపల్‌ అధికారులు వార్డుల పునర్విభజన చేసి వాటిపై అభ్యంతరాలను స్వీకరించే పనిలో ఉండగా, మరో వైపు ఎన్నికల నిర్వహణకు అసరమైన బ్యాలెట్‌ బాక్సులు, ఇతర సామాగ్రిని సేకరించి అందుబాటులో ఉంచే పని కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బందిని గుర్తించి, వారికి నియామక పత్రాలు ఇచ్చిన అధికారులు వారికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 800 మందికి ఒక పోలీంగ్‌ స్టేషన్‌ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్‌ అధికారులు మున్సిపాల్టీల వారిగా అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. స్వీకరణ గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. అనంతరం రిజర్వేషన్ల కోసం మార్గదర్శకాలను జారీ చేయనున్నారు. తర్వాత ఎన్నికల సంఘం వార్డుల వారిగా ఓటర్ల జాబితా, ప్రచురణ చేపట్టనుంది. ఈ నెల 20వ తేదీ వరకు రిజర్వేషన్లను ఖరారు చేయాలని భావిస్తున్నారు. అశాస్త్రీయంగా, అధికార పార్టీకి అనుకూలంగా వార్డుల పునర్విభజన చేస్తున్నారని కొంత మంది చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పురపాలక శాఖ అధికారులు కొట్టిపారేశారు. జనాభా, సహజ సరిహద్దుల ప్రాతిపదికన పూర్తిగా శాస్త్రీయంగా వార్డుల పునర్విభజన జరుగుతుందని, ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని స్వీకరించి పరిష్కరిస్తామని అధికారులు పేర్కొంటున్నారు