35 లక్షలైతే మడకు భూములు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

35 లక్షలైతే మడకు భూములు

కుదరని ఏకాభిప్రాయం
విజయవాడ, జూలై 13, (way2newstv.com)
భూమి కొనుగోలు పథకం కింద ఎకరానికి రూ.35లక్షలు చెల్లించి బందరు ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూములు తీసుకోవాలని పోర్టు ప్రతిపాదిత గ్రామ రైతులు స్పష్టం చేశారు. భూమి కొనుగోలు పథకానికి సంబంధించి కలెక్టర్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ  రైతులతో సమావేశమైంది. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం హాజరై ధర నిర్ణయంపై రైతుల అభిప్రాయాలు సేకరించారు. చాలా మంది రైతులు తాము పోర్టుకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నామని, అయితే ఎకరానికి రూ.35లక్షలు పరిహారం ఇవ్వాలని కమిటీ ముందు చెప్పడం విశేషం. 
35 లక్షలైతే మడకు భూములు

ఇప్పటికే రూ.22లక్షలు ఇచ్చేందుకు ఒక నిర్ణయానికి వచ్చిన కమిటీ మరో రూ.3లక్షలు పెంచుతూ రూ.25లక్షలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అది కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి ఎకరానికి రూ.25లక్షలు ఇప్పించేందుకు కృషి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ లక్ష్మీకాంతం హామీ ఇచ్చారు. అయితే కొంత మంది రైతులు మాత్రం రూ.35లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీనిపై స్పందించిన కలెక్టర్ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని రైతులు స్వచ్చందంగా పోర్టు నిర్మాణానికి ముందుకు రావాలని మంత్రి రవీంద్ర, కలెక్టర్ లక్ష్మీకాంతం విజ్ఞప్తి చేశారు. రోజు రోజుకీ వెనుకబడుతున్న ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు పోర్టు ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రైతులంతా పెద్ద మనస్సు చేసుకోవాలని  సూచించారు.