ఆంధ్రప్రదేశ్‌లో గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన 9వేల పైచిలుకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు బౌన్స్ అయిన వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలో వివిధ శాఖల నుంచి నిధులను ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ప్రాయోజిత సంక్షేమ పథకాలకు ఎన్నికలకు ముందు ఆదరాబాదరాగా మళ్లించారు. వీటిలో సీఎంఆర్ఎఫ్ నిధులు కూడా ఉన్నాయి. దీంతో బాధితులకు ఇచ్చిన చెక్కులు వరుసగా బౌన్స్ అయ్యాయి. వీటిపై ఆరా తీస్తున్న జగన్ సర్కారు.. అవసరమైతే బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఏపీలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తమ అనుయాయులకు భారీ స్ధాయిలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కింద నిధులు కేటాయించింది. ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఎమ్మెల్యేలు అడిగిందే తడవుగా సీఆర్ఎంఎఫ్ చెక్కులు జారీ అయ్యేవి.
9 వేల చెక్స్ తో జగన్ బౌన్సర్
కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి విచక్షణ కింద లక్షలాది రూపాయల మేర చెల్లింపులు చేశారు. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవతో పాటు పింఛన్ల పెంపు వంటి కార్యక్రమాలను తెరపైకి తెచ్చారు. వీటిని అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయల ఖర్చు తప్పనిసరి అయింది. దీంతో ప్రభుత్వ శాఖల్లో ఖర్చు కాకుండా మిగిలి ఉన్న నిధులను విచ్చలవిడిగా దారి మళ్లించారు.ముఖ్యమంత్రి సహాయనిధి ఖాతాలో ఉన్న నిధులు కూడా భారీగా దారి మళ్లించినట్లు అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. అదే సమయంలో ఎన్నికల సమయం కాబట్టి అడిగిందే తడవుగా సీఆర్ఎంఎఫ్ చెక్కులు కూడా ఇస్తూ పోయారు. ఫలితంగా కోట్లాది రూపాయలు చెక్కులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. బాధితులకు ఇచ్చిన చెక్కులను వారు నగదుగా బదిలీ చేసుకునేందుకు ప్రయత్నించిన సందర్భంలో అవి బౌన్స్ అయ్యాయి. దీంతో బ్యాంకుల నుంచి బాధితులు నిరాశగా వెనుదిరిగారు. ఇలా బౌన్స్ అయిన చెక్కుల సంఖ్య 9 వేలకు పైమాటేనని ప్రస్తుత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీటి విలువ దాదాపు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఉంటుందని సీఎంవో అధికారులు చెబుతున్నారు.ఇలా చెక్కులు బౌన్స్ అయిన వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టిసారిస్తోంది. సాధారణంగా ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్ధలు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయితే సదరు చెక్కులు జారీ చేసిన వ్యక్తులు లేదా సంస్ధల బాధ్యులకు జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశముంది. అయితే ఈ చెక్కులన్నీ గత ప్రభుత్వం జారీ చేసినవి కాబట్టి అప్పట్లో ఇందుకు బాధ్యత వహించిన అధికారులపై చర్యలు తీసుకునే అంశాన్ని ప్రస్తుత జగన్ సర్కారు పరిశీలిస్తోంది. వీటిలో బాధితులతో చెక్ బౌన్స్ కేసులు పెట్టించే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లేదా వీటిపై ఓ కమిటీ వేసి అక్రమాలను నిర్ధారించి కేసులు నమోదు చేస్తే ఎలా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.చంద్రబాబు హయాంలో జారీ చేసిన 9 వేలకు పైగా చెక్కులు బౌన్స్ కావడంపై సీఎంవో సీరియస్ గా ఉన్నట్లు అర్ధమవుతోంది. అయితే ఇందులో అక్రమాలను పూర్తిస్ధాయిలో నిర్ధారించడంతో పాటు బాధ్యలు ఎవరన్న దానిపై అధికారులు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు లేదా నేరుగా కేసుల నమోదు వంటి చర్యలు తీసుకనే అవకాశముంది. మరోవైపు అప్పట్లో చెక్కులు బౌన్స్ కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిజమైన బాధితులు తమ అవసరాన్ని బట్టి మరోసారి దరఖాస్తు చేసుకుంటే సీఆర్ఎంఎఫ్ తరఫున నిధులు కేటాయించేందుకు కూడా సిద్ధమని అధికారులు చెబుతున్నారు.