కర్నూలు 9 మండలాల్లో కరువే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కర్నూలు 9 మండలాల్లో కరువే

కర్నూలు, జూలై 18, (way2newstv.com)
జిల్లాపై కరువు మేఘాలు కమ్ముకున్నాయి. వర్షాకాలం మొదలై నెలన్నర కావస్తున్నా ఇప్పటిదాకా వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్‌ సాగు స్తంభించిపోయింది. జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు 6.2 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటిదాకా కేవలం 44 వేల హెక్టార్లలో మాత్రమే సాగయ్యింది. సాధారణ వర్షపాతం ఉంటే ఈ పాటికే ఖరీఫ్‌ సాగు సగంపైనా సాగు కావాల్సి ఉంది. జిల్లాలో ఎక్కడా వర్షాలు కురవకపోవడంతో దాదాపు అన్ని మండలాల్లోనూ ఖరీఫ్‌ సాగు ముందుకు సాగని పరిస్థితి ఉంది. సి.బెళగల్‌, ఆలూరు, కృష్ణగిరి, దొర్నిపాడు, తుగ్గలి, పత్తికొండ, హాలహర్వి, అవుకు మండలాల్లో ఇప్పటిదాకా చినుకే రాలని పరిస్థితి ఉంది. అలాగే చిప్పగిరి, కొలిమిగుండ్ల, ఆళ్లగడ్డ, పాణ్యం, జూపాడుబంగ్లా, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ, చాగలమర్రి తదితర మండలాల్లో 96 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 
కర్నూలు 9 మండలాల్లో కరువే

ఈ సీజన్‌లో జూన్‌లో సాధారణ వర్షపాతం 77 మిల్లీమీటర్లకు గాను కేవలం 60 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. జూన్‌లో 21 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, జులైలో సాధారణ వర్షపాతం 117 మిల్లీమీటర్లు కాగా ఇప్పటిదాకా 55 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా కేవలం 17 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయింది. ఈ ఏడాది సాగునీటి వనరుల కింద కూడా సాగు ప్రశ్నార్థకంగా తయారైంది. వర్షాలు రాకున్నా తుంగభద్ర దిగువ కాల్వ కింద, తెలుగుగంగ కింద ఉండే ఆయకట్టుకు జులై నాటికి సాగు నీరు అందించే పరిస్థితి ఉండేది. ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టుల్లో ఎక్కడా నీటి లభ్యత లేకపోవడంతో పంట కాల్వల కింద కూడా సాగు స్తంభించిపోయింది. ఇప్పటిదాకా జిల్లాలో కేవలం 44 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. పత్తి 26,700, మొక్కజొన్న 5,600, కంది 2,400, వేరుశనగ 5 వేలు, ఆముదం 1700, ఉల్లి 2,300 హెక్టార్లలో సాగు జరిగింది. సాగైన ఈ పంటలు కూడా వర్షాలు లేక వాడు ముఖం పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నెలాఖరు నాటికి వర్షాలు కురవకపోతే ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. జిల్లాలో ప్రధాన పంటలైన వేరుశనగ, పత్తికి అదును తప్పుతుందేమోనని రైతాంగం ఆందోళన చెందుతోంది.