అర్బన్ హౌసింగ్ పై నీలి నీడలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అర్బన్ హౌసింగ్ పై నీలి నీడలు


ఒంగోలు, జూలై 1, (way2newstv.com)
వచ్చే ఉగాది నాటికి గ్రామాలలో ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోతే కొనుగోలు చేసైనా సిద్దం చేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ఇదే క్రమంలో అదే సమావేశంలో ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గత టిడిపి ప్రభుత్వంలో నిర్మాణ దశలో ఉన్న అర్బన్‌ హౌసింగ్‌పై మాట్లాడారు. 'అందరికీ ఇళ్లు' పథకంలో భాగంగా గత ప్రభుత్వం మంజూరు చేసిన జిప్లస్‌3 ఇళ్ల నిర్మాణాలను ఏం చేయాలని సమావేశంలో లేవనెత్తారు. దీంతో స్పందించిన సిఎం జగన్‌ వారికి కూడా ఇళ్లు కట్టిద్దామని చెప్పారు. పక్కనే ఉన్న మరో మంత్రి పేర్ని నాని అర్బన్‌ హౌసింగ్‌లో తీవ్రమైన అవినీతి జరిగిందని చెప్పడంతో జగన్‌ దానితో ఏకీభవించారు. దీంతో అర్బన్‌ హౌసింగ్‌పై మళ్లీ నీలినీడలు అలుముకున్నాయి. ఒంగోలు నగరంలో అందరికి ఇళ్ల నిర్మాణ పథకాన్ని మూడు విడతలుగా ఎంపిక చేశారు. 

అర్బన్ హౌసింగ్ పై నీలి నీడలు

మొదటి విడత వారికి 1500 మందికి చింతల వద్ద ఉన్న మున్సిపాలిటీ స్థలంలో జిప్లస్‌-3 పద్ధతిలో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇక రెండు, మూడు విడతల్లో 14,656 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కొప్పోలు సమీపంలో రూ.17 కోట్లతో 50 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ 50 ఎకరాల్లో 4,512 మందికి మాత్రమే ఇళ్లు నిర్మించేలా ఇంజనీర్లు డిజైన్‌ చేయడంతో 14,656గా ఉన్న లబ్ధిదారుల జాబితాను వడపోసి 4,512కు కుదించారు. ఈ క్రమంలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. ఎంపిక చేసిన 4,512 మందికి లాటరీ తీసి ప్లాట్లు కేటాయించినట్లు స్లిప్పులు చేతిలో పెట్టే క్రమంలో ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కొప్పోలులో 50 ఎకరాల స్థలంలో 4,512 మందికి మాత్రమే అవకాశం ఉన్నందున అక్కడ వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని, మిగిలిన 10,044 మందికి కొప్పోలు సమీపంలోనే 76 ఎకరాల స్థలాన్ని గుర్తించామని చెప్పారు. రూ.500 కేటగిరిలో 360 చదరపు అడుగుల్లో ఇళ్ల కోరుకున్నవారే అధికంగా రెండో జాబితాలో ఉన్నందున వారందరికీ ఒకేచోట ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. స్థల సేకరణకు రూ.22 కోట్లు అవసరమని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. ఈ తతంగం జరుగుతుండగానే ఎన్నికల కోడ్‌ రావడం, కొత్త ప్రభుత్వం రావడం జరిగిపోయింది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గత ఎన్నికల్లో ఇళ్ల నిర్మాణం విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా ప్రభుత్వంతో మాట్లాడి పూర్తి సబ్సిడీతో ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తనదని గట్టిగానే ప్రచారం చేశారు. దీంతో ప్రజలు బాలినేని శ్రీనివాసరెడ్డికి జై కొట్టారు. ప్రస్తుతం మంత్రి ముందు, రాష్ట్ర ప్రభుత్వం ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. స్థల సేకరణ, అందుకు సంబంధించిన నిధులు ఓ సవాల్‌ అయితే మరో అతిపెద్ద సవాల్‌ ఈ గృహ నిర్మాణాలకు నిధులు సమీకరించడం. జిప్లస్‌3 గృహాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతోపాటు, లబ్ధిదారుని వాటా కొంత, మెజారిటీ బ్యాంకు రుణం ఉంటుంది. ఇప్పుడు బ్యాంకు రుణం కూడా లేకుండా వంద శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఒంగోలుకే వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నిధులు విడతల వారీగా కేటాయిస్తారా...? ఒకేసారి కేటాయించి మొత్తం ఇళ్లు పూర్తి చేస్తారా...? ముఖ్యమంత్రి చెప్పినట్లు ఉగాది నాటికి ఒంగోలులో ఇళ్లలో చేరేది ఎందరు? అనే ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంది. ఇళ్ల నిర్మాణం విషయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఖరేంటన్నది తేలాల్సి ఉంది. అప్పటి వరకు ఒంగోలులో అందరికీ ఇళ్ల నిర్మాణ పధకం (జిప్లస్‌3) గృహాలమీద అలుముకున్న నీలినీడలు వీడనట్లే.