రాను రానూ రాజకీయాల్లో సేవాగుణం అంతరిస్తోంది. పదవులే పరమావధి అవుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే గిరి చాలు. దాన్ని కీర్తి కిరీటంలో దాచుకుంటే అదే పదివేలు అన్నట్లుగా తయారైంది వ్యవస్థ. ముఖ్యంగా సినిమా ఇతర రంగాల నుంచి వచ్చిన వారు గెలిచిన ప్రజలకు ముఖ్యం చూపించడం ఘనమైపోతోంది. అయిదేళ్లకు సేవ చేయమని జనం ఎన్నుకుంటే కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా నియోజకవర్గాన్ని చూసేందుకు తీరిక లేని సెలిబ్రిటీలు నాయకులు అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ తనని ఎన్నుకున ప్రజలకు తన దూత ద్వారా సేవ చేయిస్తానని ఇచ్చిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మరి ఆ తోకనే మేము ఎన్నుకునేవాళ్ళంగా, మధ్యలో నీవేందుకు అని ప్రజలే అడిగి కడిగి పారేస్తున్న చైతన్యం కనిపిస్తోందక్కడ.
అక్కడ సన్నీ... ఇక్కడ బాలయ్య
హిందూపురంలో కూడా బాలకృష్ణ తీరు అలాగే కన్పిస్తుంది.ఏపీలో కూడా కొందరు సెలిబ్రిటీలు ఉన్నారు. వారు గెలవడానికి మంచి సీటు చూసుకుంటారు. గెలిచాక మళ్ళీ అక్కడకు పోరంటే పోరు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎక్కడ అంటూ అక్కడి జనం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నానా యాగీ చేసిన సంగతి ఎలా మరచిపోగలం. ఇక అక్కడ తన పీఏకు మొత్తం పెత్తనం ఇచ్చేసి బాలకృష్ణ ఎమ్మెల్యే పదవిని అనుభవించేశారు. మరో వైపు వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. . ఇక జనంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చాక ఆయన సర్దుకుని తాజా ఎన్నికల్లో చమడోడ్చారు. మొత్తానికి మరో మారు గెలిచి ఎమ్మెల్యే అనిపించుకున్నారు. గత అనుభవంతో బాలకృష్ణ ఈసారి ఎలా ఉంటారో చూడాలి.ఇక తాజా ఎన్నికల్లో సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన తరఫున భీమవరం, గాజువాక రెండు సీట్లలో పోటీ చేశారు. అయితే పవన్ సెలిబ్రిటీ ఎక్కడ ఉంటారో తెలియదని ముందే డిసైడ్ అయిన జనం ఆయన్ని ఓడించేశారంటారు. పవన్ సైతం ప్రచారంలోనే అనేక పదనిసలు చేశారు. రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట అద్దె ఇల్లు తీశారు. ఇక గెలిస్తే తన ఇంచార్జిని పవన్ పెడతారని విపక్షాలు ప్రచారం చేయడం, సొంత పార్టీలో కూడా తామే ఇంచార్జి అని కొట్లాడుకోవడం ఇవన్నీ కలసి పవన్ కొంప ముంచాయి. ఏది ఏమైనా కూడా ప్రజా ప్రతినిధి అంటే జనంలో ఉండాలి కనీసం మూడు నెలలకు ఒకసారి అయినా గెలిపించిన ప్రజల వద్దకు వెళ్లాలి. వారి బాధలు వినాలి. అంతే తప్ప నేను ఎమ్మెల్యే నా ప్రతినిధిని మరొకరుని పెడతా అంటే ఇప్పటిజనం వూరుకోరు. బాలకృష్ణ తో సహా అంతా ఈ సంగతి తెలుసుకుంటే మంచిదేమో.