ఆ గ్రామాల్లో చెరువుల్లోనే శ్మశాన వాటికలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆ గ్రామాల్లో చెరువుల్లోనే శ్మశాన వాటికలు

అనంతపురం, జూలై 28, (way2newstv.com)
బతికున్నంత వరకు వివక్షను ఎదుర్కొన్న దళితులు చివరకు చనిపోయినా ఖననం చేయడానికి ఆరు అడుగులు కరువవుతోంది. జిల్లాలోని చాలా మండలాల్లోని దళితవాడల్లో శ్మశాన వాటికలు కరువయ్యాయి. ఉన్న అరకొర శ్మశాన వాటికలు ఆక్రమణలకు గురయ్యాయి. మృతదేహాలను ఖననం చేసేందుకు స్థలాలు లేక చివరకు చెరువులు, వంకలు, వాగులు వంటి స్థలాల్లో పూడ్చుతున్నారు దళితుల ఎలాంటి దుర్భర స్థితిలో ఉన్నాయో ఈ సర్వే వివరాలు తెలిపాయి.పెనుకొండ నియోజకవర్గంలోని మూడు మండలాలు పెనుకొండ, రొద్దం, గోరంట్లలోని గ్రామాల్లో దళిత శ్మశాన వాటికలపై సర్వే చేపట్టారు. ప్రధానంగా పెనుకొండలోని 14 గ్రామాల్లో చేపట్టిన సర్వేలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. కొండాపురం, వెంకగిరిపాళ్యం గ్రామస్తులు చెరువులోనే మృతదేహాలను ఖననం చేస్తున్నారు. చెరువు నిండితే దళితులకు సమస్యలు తప్పడంలేదు. 
ఆ గ్రామాల్లో చెరువుల్లోనే శ్మశాన వాటికలు

కోనాపురం, శెట్టిపల్లి, గొందిపల్లి, పెనుకొండ తదితర గ్రామాల్లో శ్మశాన వాటికలకు ఉన్న కొద్దిపాటి స్థలం కూడా ఆక్రమణకు గురైంది. తిమ్మాపురం గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన 1.60 సెంట్ల స్థలంలో శ్మశాన వాటికకు వెళ్లేందుకు రహదారి సమస్య తీవ్రంగా ఉంది. గోనిపెంటలో వంకలో ఖననం చేస్తున్నారు. దాదాపు సమాదులన్నీ కొట్టుకుపోయాయి. గుట్టూరు, బండ్లపల్లి గ్రామాల్లో మృతదేహాలను పూడ్చుతున్న పరిస్థితి ఉంది. సమాధులు కట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. గోరంట్లలోని ఈ గంగంపల్లి కేవలం రెండు సెంట్లు మాత్రమే శ్మశాన వాటికకు స్థలం ఉంది. అదికూడా చెరువు పొరంబోకు వుండటం గమనార్హం. వానవొల్లులో అయితే కాలువగట్టుమీద 2.5 ఎకరాలు స్థలం ఉంది. అక్కడే ఖననం చేస్తున్నారు. సింగిరెడ్డిపల్లిలో కూడా కాలువ గట్టమీద ఉన్న మూడు ఎకరాల స్థలం ఆక్రమణలకు గురయ్యింది. ఇరుగవాండ్లపల్లి శ్మశాన వాటికకు ప్రత్యేకంగా స్థలంలేదు. రొద్దం మండలంలో అయితే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. చాలా గ్రామాల్లో ప్రత్యేక శ్మశాన వాటిక స్థలాలు లేవు. ఎక్కడ పడితే అక్కడ ఖననం చేస్తున్నారు. రెడ్డిపల్లిలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 4 ఎకరాల స్థలం ఉన్నా రికార్డులు లేకపోవడంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జా చేసి ప్లాట్లు వేశారు. దొడగట్ట, పాతర్లపల్లి, ఆర్‌లోచర్ల గ్రామాల్లో ప్రత్యేక శ్మశాన వాటిక స్థలం లేదు. రొద్దం, ఎం.కొత్తపల్లి, నల్లూరులో ప్రత్యేక శ్మశాన వాటిక లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మోపుర్లపల్లిలో ప్రభుత్వం ఇంత వరకు స్థలం కేటాయించలేదు. గౌరాజుపల్లిలో నేటి పొరంబోకు స్థలాన్ని కేటాయించారు. దీన్ని సాగుదారులు అక్రమించినట్లు సర్వేలో తేలింది. ఇలా ఏ గ్రామంలో చూసినా దళిత శ్మశాన వాటికల పట్ల ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, జూఅధికారులకు ఏ మాత్రం శ్రద్ధ ఉందో అర్థమవుతోంది.