గోకులానికి దిక్కెవరు..? ( శ్రీకాకుళం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గోకులానికి దిక్కెవరు..? ( శ్రీకాకుళం)

శ్రీకాకుళం, జూలై 18  (way2newstv.com):
 పాడి పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం మినీ గోకులం షెడ్లు మంజూరు చేసింది. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. మంజూరైన వారిలో చాలామంది అప్పోసప్పో చేసి నిర్మాణాలు పూర్తిచేశారు. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కో షెడ్డుకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వెచ్చించారు. షెడ్లు నిర్మించి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం బిల్లులు మాత్రం మంజూరుచేయలేదు. దీంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. షెడ్లుకు బిల్లులు వస్తాయా, రావా అనే మీమాంశలో ఆవేదన చెందుతున్నారు. మినీ గోకులం షెడ్లకు పది శాతం వ్యయం రైతు భరించాలి. మిగతాది ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా సమకూరుస్తుందని చెప్పారు. 
గోకులానికి దిక్కెవరు..? ( శ్రీకాకుళం)

రెండు ఆవుల షెడ్డుకు రూ.లక్ష, నాలుగు ఆవులకు రూ.1.50 లక్షలు, ఆరు ఆవులకు రూ.1.80 లక్షలు చెల్లిస్తామనడంతో ఆ మేరకు వెచ్చించి రైతులు మినీ గోకులాలు నిర్మించుకున్నారు. జిల్లాలో 10,156 మినీ గోకులం షెడ్లు మంజూరు కాగా 6,184 మంది నిర్మాణాలు ప్రారంభించారు. ఇందుకు రూ.6.49 కోట్లు మెటీరియల్‌ కాంపొనెంట్‌, రూ.55 లక్షలు కూలీ కింద బిల్లులు చెల్లించాల్సి ఉంది.రణస్థలం మండలంలో.. 370 మంది దరఖాస్తు చేసుకోగా 275 మందికి షెడ్లు మంజూరయ్యాయి. 120 మంది నిర్మాణాలు పూర్తి చేయగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. లావేరు మండలంలో.. 565 మంది దరఖాస్తు చేసుకోగా అందరికీ మంజూరయ్యాయి. 232 మంది నిర్మాణాలు పూర్తి చేయగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. దాదాపు జిల్లా అంతటా ఇదే పరిస్థితి. రైతులు బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి గోకులం షెడ్లు నిర్మించుకున్నారు. నెలలు గడుస్తున్నా బిల్లులు మంజూరుకాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ డబ్బులతో పశువులు కొనుగోలు చేసుకుని ఉన్నా ఆదాయం వచ్చేదని ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందనే ఉద్దేశంతో షెడ్లు నిర్మాణాలు చేపడితే తీరా బిల్లులు మంజూరు కావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.