వైసీపీలో వాలంటీర్ల వార్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైసీపీలో వాలంటీర్ల వార్

శ్రీకాకుళం, జూలై 24, (way2newstv.com)
గ్రామ వాలంటీర్. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా, ఇదే హడావుడి. దరఖాస్తులు, సర్టిఫికెట్లు పట్టుకుని అభ్యర్థులు, నెట్‌ సెంటర్లకు క్యూకడుతున్నారు. ఈ గ్రామవాలంటీర్ల నియామకం, తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇచ్చిన మాట ప్రకారం హామీ నిలబెట్టుకున్నామని సంబరపడుతోంది వైసీపీ. ఈ వాలంటీర్ల వ్యవస్థ, వచ్చే స్థానిక ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపిస్తుందని వైసీపీ అధినాయకత్వం ధీమాగా ఉంది. కానీ చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒక విమర్శ, అదే వైసీపీ హైకమాండ్‌లో దడపుట్టిస్తోందట. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా చూడ్డంతో పాటు నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన గ్రామ వాలంటీర్ నియామకాలు సిక్కోలులో చర్చనీయాంశంగా మారాయి. 
వైసీపీలో వాలంటీర్ల వార్

50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో, ఇప్పటికే దీనికి సంబంధించి ఇంటర్వ్యూల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇదే వాలంటీర్ల నియామకం వైసీపీలో రచ్చకు కారణమవుతోంది.  శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 38 మండలాల పరిధిలో 1148 గ్రామ పంచాయితీలలో, 1253 గ్రామ సచివాలయాలు రూపుదిద్దుకోనున్నాయి. వీటి ద్వారా 11,924 మందికి వాలంటీర్‌లుగా ఉపాధి లభించడంతో పాటు 27,14,455 మంది ప్రజలకు సేవలందుతాయి. దీంతో జిల్లాలోని నిరుద్యోగ యువత గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూల కోసం బారులు తీరుతున్నారు. పదో తరగతి అర్హత అయినప్పటికీ పీజీ, బి టెక్ విద్యార్ధులు కూడా వాలంటీర్ పోస్ట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ వాలంటీర్ నియామకాల ప్రక్రియ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ప్రమేయంతో నాయకులూ ఇచ్చిన జాబితా ప్రకారమే నియామకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత కంటే రాజకీయ పైరవీలు చేసిన వారికే ఈ పోస్ట్ లభిస్తుందనే బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు నాయకులూ జాబితాను సిద్ధం చేసిన తరువాత, అధికారులు ఇంటర్వ్యూలను నామమాత్రంగా చేస్తున్నారన్న ప్రచారం, ఇప్పుడు జిల్లాలో జోరుగా సాగుతోంది. ఆ నోటా ఈ నోటా వినిపిస్తున్న ఈ ఆరోపణలు, అమరావతిలో అధిష్టానం దృష్టికీ వెళుతుండటంతో, స్థానిక నేతలు టెన్షన్‌ పడుతున్నారు. ఇటీవల జిల్లాలోని వీరఘట్టం మండలం బిట్టువాడ గ్రామంలో వెలుగుచూసిన ఓ ఘటన ఈ అనుమానాలకు ఆజ్యం పోస్తోంది. గ్రామంలో 50 రజక కుటుంబాలున్నా, ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరిని కూడా వాలంటీర్ పోస్ట్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. సామాజికవర్గ పరంగా వాలంటీర్ పోస్టులు భర్తీ చేయడం అధికారులకే కాదు రాజకీయ నాయకులకు కూడా తలనొప్పిగా మారింది. దీనికితోడు ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అధికార పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. గ్రామ వాలంటీరుగా తమ వర్గానికి చెందినవారికి అవకాశం ఇవ్వాలంటూ ఏకంగా ఎమ్మెల్యే సమక్షంలో ద్వితీయ శ్రేణి నాయకులూ ఘర్షణలకు దిగుతున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో వాలంటీర్ నియామకాలు నాయకులకు సైతం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇదిలావుంటే, అధికారులు మాత్రం అవన్నీ అవాస్తవాలు అని కొట్టిపారేస్తున్నారు. నియామకాలు అన్నీ పారదర్శకంగానే నిర్వహిస్తున్నామంటూ బయటికి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తుది జాబితా బయట పెడితే తప్ప ఎంతమేరకు పారదర్శకత ఉందనేది వెల్లడి కాని పరిస్థితి. అర్హత కంటే రాజకీయ ఒత్తిళ్లకు ప్రాధాన్యత ఇస్తే, గ్రామ సచివాలయాలు, అందులో నియమితులు కాబోయే వాలంటీర్ వ్యవస్థ కూడా మరో జన్మభూమి కమిటీలుగా మారే అవకాశం ఉందనే బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. అదేగానీ నిజమైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం పడకతప్పదు. మొత్తం మీద ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు దగ్గర చేసే ఉద్దేశంతో ప్రభుత్వం నియమిస్తున్న గ్రామ వాలంటీర్ పోస్ట్‌లు వివాదాస్పదంగా మారుతున్నాయి. మరి ఈ సమస్యలను ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది వాలంటీర్లుగా ఎవరిని నియమిస్తుంది తర్వాత అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తారు స్థానిక సమరంలో వీటి ప్రభావం ఎలా ఉండబోతోంది అన్నది, పార్టీ అధినాయకత్వానికి సైతం అంతుబట్టడం లేదు.