గోదాట్లో ఇసుక తుఫాన్ (తూర్పుగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గోదాట్లో ఇసుక తుఫాన్ (తూర్పుగోదావరి)

రాజమండ్రి, జూలై 6 (way2newstv.com): 
జిల్లాలో ఇసుక తవ్వకాలు, తరలింపులో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఓ వైపు ఇసుక కొరత ప్రజలను వేధిస్తుండగా..మరోవైపు అధికారిక రేవులూ తగిన రీతిలో వారి అవసరాలను తీర్చలేక పోతుండటంతో సమస్య మరింత జటిలమైంది. ప్రభుత్వం కొత్త ఇసుక విధానం దిశగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో జిల్లాలోని 23 రేవులపై ఆంక్షలు అనివార్యమయ్యాయి. కొత్త విధానాన్ని ప్రకటించే వరకు రెండు రేవులకు మాత్రమే జిల్లా కలెక్టర్‌ అనుమతి ఇచ్చారు. అందులో ఆత్రేయపురం మండలంలోని తాడిపూడి, తాళ్లరేవు మండలం పిల్లంక రేవులు ఉన్నాయి. వీటిలో తాడిపూడి రేవు వివాదాలతో మూతపడగా పిల్లంక రేవు అరకొరగా పనిచేస్తోంది. 
గోదాట్లో ఇసుక తుఫాన్ (తూర్పుగోదావరి)


జిల్లాలో గృహ నిర్మాణాలు, ఇతర పనులు జోరుగా సాగుతున్న పరిస్థితిలో ఇసుక లభ్యత గగనమవడం పలు విమర్శలకు తావిస్తోంది. ముందుచూపుతోనో.. దొడ్డిదారిన ఇసుక నిల్వలు ఉంచుకున్న వారికి మాత్రం తాజా పరిస్థితి కాసుల పంట పండిస్తోంది.జిల్లాలోని రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, మలికిపురం, కడియం, ఆత్రేయపురం, సీతానగరం, కపిలేశ్వరపరం, తాళ్లరేవు మండలాల్లో మొత్తం 28 ఇసుక రేవులు ఉండేవి. వీటిలో మూడింటిని గతంలో వివిధ కారణాలతో మూసివేశారు. మిగిలిన 25 రేవులపై రాష్ట్ర ప్రభుత్వం  నెల క్రితం ఆంక్షలు విధించింది. అనంతర క్రమంలో ప్రజలు, ప్రభుత్వ అవసరాల దృష్ట్యా జిల్లాలో పర్యావరణ అనుమతులున్న తాడిపూడి, పిల్లంక రేవుల్లో ఇసుక తవ్వకాలకు  గత నెల 14న అధికారిక అనుమతులు ఇచ్చారు. కొత్త పాలసీ వచ్చేవరకు ఇసుక తవ్వకాలపై నిషేధం విధిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తాడిపూడి రేవులో 33,440 క్యూబిక్‌ మీటర్లు, పిల్లంక రీచ్‌లో 44,929 క్యూబిక్‌ మీటర్ల ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు ఉంచిన నిల్వలూ ఓ వైపు అడుగంటుతుండగా, మరోవైపు ప్రైవేటు భవన నిర్మాణ రంగం, ప్రజలు ఇసుక కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఆత్రేయపురం మండలంలోని తాడిపూడి ఇసుక రేవు మూతపడింది. రేవుకు అనుమతించిన రోజుకు ఇక్కడ 33,440 క్యూబిక్‌ మీటర్ల ఇసుక నిల్వ ఉందనేది అధికారిక సమాచారం. వాస్తవరగా ఇక్కడ మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగానే అధికారులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇసుక రవాణాకు అధిక ధరలు వసూలు చేస్తున్నారని కొందరు ఆందోళనకు దిగడం, ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్ల వేగానికి కళ్లెం వేయాలని స్థానికులు నిరసనలు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. ఇక్కడి నుంచి ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించడం, ఇసుకతో పల్లపు ప్రాంతాలు పూడ్చడం వంటి వ్యవహారాలు అధికారులకు శిరోభారంగా మారాయి.