కొత్త ప్రభుత్వంతో సింగపూర్ ప్రతినిధుల చర్చలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొత్త ప్రభుత్వంతో సింగపూర్ ప్రతినిధుల చర్చలు

విజయవాడ, జూలై 18, (way2newstv.com)
రాజధానిలో తమ పనుల కొనసాగింపునకు అవకాశం ఇవ్వాలని సింగపూర్‌ కన్సార్టియం ప్రతినిధులు ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలు పెట్టారు. దీనిలో భాగంగా అసెండాస్‌, సింగ్‌బ్రిడ్జ్‌కు చెందిన నిపుణులు సాధారణ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్‌.పి.సిసోడియాను కలిశారు. రాజధాని విషయంలో చేసుకున్న ఒప్పందాలపై చర్చించారు. నూతన ఫ్రభుత్వం ఏర్పాటైన నేపథ్యం లో మర్యాదపూర్వకంగా కలిశారని అధికారులు పేర్కొన్నారు. అంతర్గతంగా స్విస్‌ఛాలెంజ్‌పై చర్చించినట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం 1691 ఎకరాల్లో తమకు సదుపాయాలు కల్పించి ఇవ్వాల్సి ఉందని, దానిపై దృష్టి సారిస్తే తాము ముందుకొస్తామని ప్రతినిధులు సిసోడియా దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. మే 29వ తేదీ నుండి రాజధానిలో పనులు నిలిపేసిన సంగతి తెలిసిందే. 
కొత్త ప్రభుత్వంతో సింగపూర్ ప్రతినిధుల చర్చలు

అయితే ఒప్పందానికి సంబంధించిన వివరాలు తెలపాలని, దీనిపై వెంటనే ప్రభుత్వంతో చర్చించాలని సిఆర్‌డిఏ ఒప్పంద కంపెనీకి సమాచారం పంపినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన అసెండాస్‌, సింగ్‌బ్రిడ్జ్‌ కన్సార్టియం ప్రతినిధులు మంగళవారం సెక్రటేరియట్లో సిసోడియాను కలిసి తమ అభిప్రాయం తెలిపారు. నిధుల సమస్య నేపథ్యంలో స్విస్‌ఛాలెంజ్‌ ఒప్పందంపై ఇప్పుడే ఎటువంటి అభిప్రాయమూ చెప్పలేమని రాష్ట్ర ఫ్రభుత్వ ప్రతినిధి వారి దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వివరాలతో మరో వారంలో ప్రభుత్వాన్ని సంప్రదించాలని కన్సార్టియం ప్రతినిధులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో రాజధాని పనులన్నీ నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే రెండుసార్లు సింగపూర్‌ కన్సార్టియం ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కలిశారు. అయితే స్విస్‌ ఛాలెంజ్‌లో చేసుకున్న ఒప్పందం ప్రకారం పనులు ప్రారంభానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే దానికి కూడా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రసుత్తం దీనిపైనే చర్చ జరుగుతోంది. సిఎంతో సంప్రదించిన అనంతరం దీనిపై తుది నిర్ణయం వెలువరిస్తామని సిఆర్‌డిఏ అధికారులు చెబుతున్నారు. ఒకటీ రెండు రోజుల్లో దీనిపై సిఎం సిఆర్‌డిఏ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అధికారికంగా సింగపూర్‌ కన్సార్టియంకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవేళ న్యాయపరంగా చిక్కులుంటాయనుకుంటే కన్సార్టియం సంప్రదించిన తరువాత సమాధానం ఇచ్చే అంశంపై పరిశీలించొచ్చని పట్టణాభివృద్దిశాఖ అధికారులు చెబుతున్నారు.