సింగూరు జలాల కోసం ఆందోళనలు


నిజామాబాద్ జూలై 3, (way2newstv.com)
సింగూరు జలాలు మరోమారు వివాదాస్పదమయ్యాయి. తమ వాటా తమకు ఇవ్వాలంటూ నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ ఆయకట్టు రైతులు ఆందోళన బాటపట్టారు. సింగూర్ జలాల కోసం పార్టీలకు అతీతంగా రోడ్డెక్కుతున్నారు. నిజాంసాగర్ డెడ్ స్టోరేజీలో ఉండటం, సింగూరులో 18 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో రైతుల నుంచి డిమాండ్ పెరిగింది. నీటి విడుదలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.మంజీరా నదిపై నిజాకాలంలో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. జిల్లాలోని రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టును ఈ ప్రాజెక్టు పరిధిలో స్థిరీకరించారు. 1405 అడుగులు 17 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు సుమారు 12 మండలాల రైతలకు వరప్రదాయినిగా వర్ధిల్లుతోంది. అయితే ఎంతో ఘనమైన చరిత్రగల ఈ పురాతన ప్రాజెక్టు నేడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 

సింగూరు జలాల కోసం ఆందోళనలు

మూడేళ్ల తర్వాత గతఏడాది మాత్రమే జలకళను సంతరించుకొని కాస్త ఊరటనిచ్చింది. వర్షాకాలం చివరలో కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండింది. ఖరీఫ్, రబీ రెండు పంటలకు పుష్కలంగా సాగు నీరు అందింది. ప్రస్తుతం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి పడిపోయింది. కేవలం మూడు టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దానిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తారు. నిజాంసాగర్ ఎగువన మంజీరా నదిపై సింగూరు ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను నిర్మించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండినపుడు అక్కడి నుంచి నిజాంసాగర్ కు 9 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. ఇది మెదక్, నిజామాబాద్ జిల్లా మధ్య జరిగిన ఇరిగేషన్ శాఖ ఒప్పందం. మరోవైపు సింగూరు ముమ్మాటికి ఇందూర్ హక్కు అనే వాదనా వినిపిస్తోంది. మెదక్ జిల్లా అవసరాలతోపాటు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఇక్కడి నుంచి మంజీరా జలాలను మళ్లిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా నిజాంసాగర్ లోకి చుక్క వరదనీరు రాలేదు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కేవలం బోర్లపైనే ఆధారపడి వరినాట్లు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అయితే సింగూరులో నీరు ఉన్నందుల అక్కడి నుంచి నిజాంసాగర్ కు నీటిని విడుదల చేసి తమ పంటలను తడపాలని జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే వర్ని, బాన్సువాడ, కోటగిరి, బోదన్ తదితర మండలాల్లో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. జిల్లాకు చెందిన వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కూడా కలిసి తమ గోడును వినిపించారు. మరోవైపు నీటిని విడుదల చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయా ప్రాంతాల రైతు సంఘాలు ప్రకటించాయి. వీరికి ప్రతిపక్షాలు కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి.సింగూరు జలాలు విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశామని త్వరలోనే నీటిని విడుదల చేస్తామని మంత్రి పోచారం భరోసా ఇస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో కూడా ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.ప్రభుత్వం నుంచి సానూకుల స్పందన రాకపోతే మరో ఉద్యమానికి సిద్ధమని రైతులు స్పష్టం చేస్తున్నారు.
Previous Post Next Post