పెరుగుతున్న పెళ్లి వయస్సు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పెరుగుతున్న పెళ్లి వయస్సు

ఒంగోలు ,జూలై  30, (way2newstv.com)
పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారిని ప్రయోజకులను చేయడం వరకు బాగానే ఉన్నా.. వారికి వివాహం చేసే విషయంలో మాత్రం తల్లిదండ్రులు  అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా కుమారుల వివాహ విషయంలోనే ఎక్కువగా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొడుకు పుట్టాలని తమ ఇష్ట దైవాలను పూజించడం, మొక్కులు చెల్లించడం వంటివి కొందరు తల్లిదండ్రులు చేస్తారు. కొడుకు పెరిగి పెద్దవాడైన తరువాత అతని పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేయడానికి ప్రస్తుతం తల్లిదండ్రులు వేయి దేవుళ్లకు మొక్కుతున్నారు. జీవితాంతం పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేసిన తరువాత పెళ్లి చేస్తే ఓ పనైపోతుందనుకుంటే సంబంధాలు అంత తేలిగ్గా కుదరడం లేదు. 
 పెరుగుతున్న పెళ్లి వయస్సు

యువకుల సంఖ్యకు తగ్గట్టు యువ తులు లేకపోవడం, ఉద్యోగం వచ్చి స్థిరపడే వరకు పెళ్లి ప్రస్తావన చేయకపోవడం, అబ్బాయిల విషయంలో అమ్మాయిలు రాజీ పడకపోవడం, అమ్మాయిలు కోరుకున్నట్లు యువకులు లేకపోవడం తదితర కారణాలతో జిల్లాలో పెళ్లి కాని ప్రసాద్‌ల సంఖ్య పెరుగుతోంది. గతంలో కుటుంబానికి పెద్ద దిక్కయిన తండ్రి ఎంత చెబితే అంతలా ఉండేది. అమ్మాయిలకు పెళ్లి సంబంధాలలో కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు ఏ సంబంధం చూసినా పిల్లలు అభ్యంతరం చెప్పేవారు కాదు. అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోకుండానే పెళ్లి ముహూర్తం ఖరారు చేసేవారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అమ్మాయి ఓకే అంటేనే పెళ్లి చూపులు. అమ్మాయికి అబ్బాయి నచ్చితేనే పెళ్లి. అంటే ప్రాధాన్యత అమ్మాయికే ఎక్కువగా ఉంటోంది.  అబ్బాయి ఆస్తిపరుడైనా ప్రొఫెషనల్‌ కోర్సు చేసి ఉండాలని.. ఉద్యోగం కూడా చేస్తూ ఉండాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే మంచి ఉద్యోగంలో స్థిరపడిన తరువాత వివాహం చేసుకోవాలనే సంకల్పం కారణంగా అబ్బాయిల వివాహాలు ఆలస్యమవుతున్నాయి.  చదువులు, ఉద్యోగాలు, జీవిత భద్రత అంటూ.. యువతీ, యువకులు సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం లేదు. యువతులకు 23 నుంచి 25 ఏళ్లు, యువకులకు 28 నుంచి 30 ఏళ్ల తర్వాతనే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. డిగ్రీ చదివితే కనీసం ప్రైవేట్‌ ఉద్యోగం అయినా వస్తుందనుకుంటే నేటి రోజుల్లో ప్రైవేట్‌ ఉద్యోగాలు కూడా ఉన్నత చదువులు ఉంటేనే వస్తున్నాయి. ఆ చదువులు పూర్తయ్యే సరికి పెళ్లి వయస్సు మించిపోతుంది. గతంలో ఉన్నత చదువులైన మెడిసిన్, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఎంబీఏ, బీఎస్సీ అగ్రికల్చర్, ఎంసీఏ, సీఏ వంటి కోర్సులు కేవలం కొన్ని వర్గాలకు చెందిన వారు మాత్రమే చదివేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు. వీరిలో అమ్మాయిలే అధికంగా కనిపిస్తున్నారు. దీంతో అమ్మాయిల చదువు పూర్తయిన తర్వాతనే మంచి ఉద్యోగం ఉన్న యువకుడితో పెళ్లికి ఒప్పుకుంటున్నారు. చాలా మంది మధ్యతరగతి అమ్మాయిలు కూడా టీచర్‌ ఉద్యోగానికి ఆసక్తి చూపుతున్నారు. చేసుకోబోయే యువకుడు కూడా బీఈడీ చేసినట్లయితే వాళ్లిద్దరూ ప్రైవేట్‌ స్కూల్స్‌లో చిన్న ఉద్యోగం చేస్తూ జీవించవచ్చుననే భావనతో అమ్మాయిలు బీఈడీ వరుడు కోసం ఎదురు చూస్తున్నారు. అబ్బాయిలు కూడా టీచర్‌ ఉద్యోగం చేస్తున్నా కనీసం చేసుకోబోయే అమ్మాయికి బీఈడీ ఉండాలని కోరుకుంటున్నారు. పూర్వ కాలంలో తల్లిదండ్రులు సంతానం విషయంలో ఆడైనా మగైనా దేవుడు వరంగా ఇచ్చిన బిడ్డలుగా భావించేవారు. తరువాత కుటుంబ నియంత్రణ అమలులోకి రావడంతో ఆర్థిక స్థోమతును కూడా దృష్టిలో పెట్టుకుని ఇద్దరు లేక ముగ్గురితో ఎక్కువ సంతానానికి ముగింపు పలికారు. ఆ తరువాత కాలంలో (రెండు దశాబ్దాల క్రితం) ఆడపిల్లలు పుడితే వారిని చదివించడం, సంరక్షించడం, పెళ్లి చేయడం వంటివి భారంగా భావించేవారు. అదే అబ్బాయిలు అయితే ఎంత ఖర్చయినా ఉన్నత చదువులు చదివిస్తే ఉద్యోగం చేసి కుటుంబానికి ఆర్థికంగా సహకరిస్తాడని, అదే విధంగా వివాహం చేస్తే వచ్చే కోడలు తెచ్చే కట్న కానుకలతో కుటుంబం ఆర్థికంగా బలపడుతుందనే ఉద్దేశంతో మగ బిడ్డే కావాలని కోరుకున్నారు. మొదటి కాన్పులో అమ్మాయి పుడితే రెండవ కాన్పులో అబ్బాయి కోసం ఎదురు చూసేవారు.అదేవిధంగా మొదటి కాన్పులో అబ్బాయి పుడితే రెండవ కాన్పులో అమ్మాయి పుడుతుందనే భావంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌  చేయించునేవారు. దీంతో ఎక్కడి పడితే అక్కడ చట్ట విరుద్ధమైన గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించేవారు. ఆడ బిడ్డయితే భ్రూణ హత్యలకు పాల్పడేవారు. నేడు యువతీ యువకుల నిష్పత్తిలో తేడాలు పెరగడానికి ఇదో కారణం. ప్రతి వెయ్యి మంది పురుషులకు 980 మంది మహిళలు మాత్రమే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. సమాజంలో మార్పులు వచ్చి స్త్రీ, పురుషుల మధ్య నిష్పత్తి సమానంగా ఉంటేనే అబ్బాయిలకు సకాలంలో వివాహాలు జరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు