ఎదురుచూపులు తప్పవా..? (ఖమ్మం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎదురుచూపులు తప్పవా..? (ఖమ్మం)

ఖమ్మం, జూలై 18 (way2newstv.com): 
పంట రుణాల మాఫీ కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇంత వరకు విడుదల చేయలేదు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెల రోజులవుతున్నా.. పంట రుణాలు మాఫీ చేసుకోవాలా? వద్దా? అనే విషయంలో రైతులు మల్లగుల్లాలు పడుతున్నారు. పంట రుణాలను ఈ సీజన్‌లో రెన్యువల్‌ చేసుకుంటే మాఫీ వర్తిస్తుందా? లేదా? అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది.గత అసెంబ్లీ ఎన్నిల సందర్భంగా తెరాస తన ఎన్నికల ప్రణాళికలో రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. అందుకు అనుగుణంగానే పంట రుణాల మాఫీ కోసం బడ్జెట్‌లో నిధులను సైతం కేటాయించింది. అయితే ఇంత వరకు రుణమాఫీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. బ్యాంకర్లకుగానీ, వ్యవసాయశాఖకుగానీ ఇంత వరకు మార్గదర్శకాలు జారీ చేయలేదు. 
ఎదురుచూపులు తప్పవా..? (ఖమ్మం)

గతంలో  ప్రభుత్వం పంట రుణాలను ఏకకాలంలో కాకుండా నాలుగు విడతల్లో మాఫీ చేసింది. ఈసారి కూడా అదే విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడం, గతంలో ఇచ్చిన రుణాలను రెన్యువల్‌ చేయడం జరుగుతుంది. సీజన్‌ ప్రారంభం కావడంతో రైతులు తమ పెట్టుబడుల కోసం ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది రైతులు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు.పంట రుణాల మాఫీపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తేనే ఎవరు మాఫీకి అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయంపై స్పష్టత వస్తుందని బ్యాంకు, వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వాణిజ్య బ్యాంకుల్లో ఏడాది కిందట రుణం తీసుకున్న వారికి వడ్డీ చెల్లించి రెన్యువల్‌ చేసుకునే అవకాశం ఉంది. ఏడాది కంటే ఎక్కువ కాలం కిందట రుణాలు తీసుకున్నవారు ఇప్పుడు పంట రుణాలను రెన్యువల్‌ చేసుకుంటామంటే రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం చెల్లుబాటు కాదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వాణిజ్య బ్యాంకుల్లో పంట రుణాలు ఏడాదిలోనే రెన్యువల్‌ చేసుకునే అవకాశం ఉంది. పీఏసీఎస్‌లలో మాత్రం ఎప్పుడు రుణం తీసుకున్నా రెన్యువల్‌ చేసుకోటానికి ఆ సంస్థ ఉన్నతాధికారులు అంగీకరిస్తున్నారు. పంట రుణాన్ని ఏడాది కంటే ఎక్కువ కాలం కిందట తీసుకుని రెన్యువల్‌కు బదులు డబ్బు చెల్లించి మళ్లీ రుణం తీసుకుంటే అది కొత్త రుణం కింద పరిగణించబడుతుంది. గతంలో పంట రుణాలు మాఫీ చేసిన సమయంలో కటాఫ్‌ తేదీని నిర్ణయించి ఆ తేదీలోగా బకాయిన్న వారికి పంట రుణం మాఫీని వర్తింపజేశారు. ఈసారి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం రుణమాఫీపై ఇంత వరకు కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పంట రుణాల మాఫీపై మార్గదర్శకాలను జారీ చేస్తేనే ఈ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది.కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలివిడత రుణమాఫీ సమయంలో కొన్ని బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా అర్హులైన రైతులు రుణమాఫీ పొందలేకపోయారు. రైతులకు తెలియకుండానే కొన్ని బ్యాంకులు రుణాలను రీషెడ్యూలు చేయటం వల్ల వారికి మాఫీ వర్తించలేదు. రైతులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. సుమారు రూ.120కోట్ల వరకు మాఫీ కాలేదు. అసెంబ్లీ ఎన్నికలు, వరుసగా ఇతర ఎన్నికలు రావటంతో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని చెబుతూ వస్తున్నారు. ఇంత వరకు వాటి జాడలేదు. జిల్లాలో మొత్తం 17,642 మంది రైతులకు రూ.84 కోట్లను మాఫీ చేశారు. వీటిలో రూ.73కోట్లు ఖజానాలో చేరింది. మిగతాది చేరాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా ఒక్క రైతుకు కూడా దీన్ని అమలు చేయలేదు. రైతులు అధికారుల చుట్టూతిరిగి విసిగిపోతున్నారు. ఇటీవల కూడా ఎమ్మెల్యే వెంకటవీరయ్య వీటి గురించి ప్రస్తుతం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఏమాఫీ తమకు వర్తిస్తుందో, ఏది వర్తించదో తెలియక రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు.