ఎందుకూ పనికిరాకుండానే..(విశాఖపట్నం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎందుకూ పనికిరాకుండానే..(విశాఖపట్నం)

విశాఖపట్నం, జూలై 16 (way2newstv.com): 
భారీ వసతులతో రిసార్టులన్నారు.. వందలమందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు.. భూములను తీసుకున్నారు.. తీరా చూస్తే కాలం గడిచిపోతోంది తప్ప వాటి ఊసే లేకుండాపోయింది. ఫలితంగా నగరంలోని తీర ప్రాంతానికి ఆనుకొని విలువైన స్థలాలు నిరుపయోగంగా మారాయి. కొన్ని సంస్థలైతే స్థలాలను తీసుకుని పదేళ్లయినా నిర్మాణాలే చేపట్టలేదు. మరికొన్ని టెండర్ల ద్వారా దక్కించుకొని మరీ పట్టించుకోవడం మానేశాయి. రుషికొండకు వెళ్లే మార్గంలో కార్తీకవనం వద్ద కొండపై మూన్‌ల్యాండ్‌ రిసార్టుల నిర్మాణం కోసం మూడెకరాలను 2003లో పర్యాటక శాఖ అప్పగించింది. ఆ సంస్థ సభ్యుల మధ్య అంతర్గత విభేదాల వల్ల ఆ పనులు ముందుకు సాగలేదు. మధ్యలో పర్యాటక శాఖ నోటీసులు జారీ చేయడంతో అందులోని ఒకరు చొరవ తీసుకొని నిర్మాణాల్లో కదలిక తెచ్చినా మధ్యలోనే ఆగిపోయాయి. చివరకు ఆ స్థలాన్ని పర్యాటక శాఖ వెనక్కి తీసేసుకుంది. 
ఎందుకూ పనికిరాకుండానే..(విశాఖపట్నం)

ఈ ప్రాజెక్టు కారణంగా దాదాపు 15 సంవత్సరాలపాటు ఎంతో విలువైన స్థలం నిరుపయోగంగా ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ మూన్‌ల్యాండ్‌ ప్రాజెక్టును పర్యాటకశాఖ వేరొకరికి అప్పగించింది. ప్రస్తుత ధరల కన్నా చాలా తక్కువకే సదరు సంస్థ దక్కించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సాగర్‌నగర్‌ సమీపంలోని ప్రత్యేక శిక్షణ ద్వారా సుభాష్‌నగర్‌ వద్ద పర్యాటక శాఖ స్థలంలో కార్యాలయ నిర్మాణానికి అధికారులు శిలాఫలకం వేశారు. అది ముందుకు కదలకపోవటంతో అక్కడ రిసార్టు నిర్మాణాన్ని ప్రతిపాదించి టెండర్లు పిలిచారు. దీన్ని దక్కించుకున్న బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి అసలిటువైపు ముఖం చూపించలేదు. విసుగు చెందిన అధికారులు టెండరులో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తికి ఆ ప్రాజెక్టును అప్పగించాలని చూస్తున్నారు. కసరత్తు మాత్రం ఇంకా పూర్తి చేయలేదు. ప్రస్తుతం ఆ స్థలాన్ని పర్యాటక శాఖకు సంబంధించి ట్రాన్స్‌పోర్టు నిర్వహణ కింద వినియోగిస్తున్నారు. యారాడ కొండపై సందర్శకుల కోసం పర్యాటకశాఖ రెస్టారెంట్‌, ఇతర వసతులు కల్పించింది. వీటి నిర్వహణ టెండరును హైదరాబాద్‌కు చెందిన డ్రీమ్‌ వ్యాలీ సంస్థ దక్కించుకుంది. కార్యకలాపాలు మాత్రం ఇంకా మొదలవలేదు. పర్యాటక శాఖకు మాత్రం ప్రతి నెలా రూ. 1.50 లక్షల అద్దె చెల్లిస్తోంది. నిర్మాణాలను వినియోగించకపోవటంతో కొన్నిచోట్ల అవి పాడవుతున్నాయి. విజయనగరం జిల్లా చింతపల్లిలో పర్యాటక శాఖకు హోటల్‌ ఉంది. జల విన్యాసాలకు సంబంధించిన శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. పర్యాటక శాఖ మౌలిక వసతులు, ఇతర వనరులను అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఇవేమీ సాగకపోవటంతో నిర్వహణ సంస్థ కార్యకలాపాలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు.గతంలో రుషికొండ తీరంలో కొంత ప్రాంతాన్ని ఓ ప్రయివేటు వ్యక్తికి కేటాయించిన విషయం స్థానిక అధికారులకు తెలియలేదు. ఆయన పైస్థాయిలో ఉన్నతాధికారులను సంప్రదించి పర్యాటక ప్రాజెక్టు నిర్మిస్తానని ఆ స్థలం తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల అది రద్దయింది. జిల్లాలో పర్యాటక శాఖ పరిధిలో 355 ఎకరాల స్థలం ఉంది. ప్రస్తుతం 60 ఎకరాల్లో పదికిపైగా ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. ఇవికాక మరికొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. మరికొన్నింటి కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంది. ఏళ్లు గడిచినా వాటికి మోక్షం కలగడం లేదు.