బయోమెట్రిక్.. అంటే...? (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బయోమెట్రిక్.. అంటే...? (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, జూలై 19 (way2newstv.com): 
సర్కారు బడుల్లో బయోమెట్రిక్‌ హాజరు కలగానే మిగిలిపోతోంది. కొన్ని రోజుల్లోనే యంత్రాలు మూలకుపడిపోవడంతో కచ్చితమైన హాజరుకు కొలమానం లేకుండా పోతోంది. విద్యుత్తు సౌకర్యం, సంకేతాలు లేవనే సాకుతో అనేక పాఠశాలల్లో యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఫలితంగా రోజువారీగా లెక్కించాల్సిన హాజరుశాతాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లేమి ఫలితంగా సదుద్దేశంతో అమలు చేసిన కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.బడుల్లో సమయపాలన పాటించడంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును కచ్చితంగా లెక్కించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టు కింద జిల్లాలోని సర్కారు బడుల్లో బయోమెట్రిక్‌ యంత్రాలను ప్రారంభించింది. వీటి ద్వారా రోజూ ఉదయం, సాయంత్రం సమయానికి యంత్రంలో వేలిముద్ర వేయగానే ఎంతమంది బడికి సరైన సమయానికి వస్తున్నారో.. ఎంతమంది డుమ్మా కొడుతున్నారో స్పష్టంగా తెలిసిపోతుంది. 
బయోమెట్రిక్.. అంటే...? (ఆదిలాబాద్)

రెండేళ్ల క్రితం ప్రారంభించిన కార్యక్రమానికి తక్కువ కాలంలోనే మూలకుపడేలా చేశారు. ఒక్కో పాఠశాలలో వందమంది విద్యార్థులకు ఒక పరికరం చొప్పున జిల్లావ్యాప్తంగా 671 బడుల్లో వీటిని అమర్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు సంబంధించిన ఆధార్‌ సంఖ్యలు, వేలిముద్రలు, ఐరిస్‌ వివరాలను సేకరించి ఇందులో పొందుపర్చారు. ప్రధానోపాధ్యాయుల సమక్షంలో రోజూ ఉదయం బడుల సమయానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి వేలిముద్రలు వేసి హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తొలుత కొన్ని రోజుల వరకు బాగానే పనిచేసిన ఈ యంత్రాలు అనంతరం వివిధ కారణాల చేత మూలకుపడ్డాయి. బ్యాటరీలకు ఛార్జింగ్‌ లేదనే సాకుతో పాటు పరికరాల్లో సాంకేతిక లోపం తలెత్తిందనే కారణంగా వీటిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగానే ఈ యంత్రాలు పనిచేయకుండా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రోజంతా విద్యుత్తు సరఫరా ఉంటున్నా.. బ్యాటరీలకు ఛార్జింగ్‌లు పెట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని చోట్ల ఉపాధ్యాయులు ఉదయం పూట పాఠశాలలకు వెళ్లి ఈ యంత్రాల్లో హాజరు వేసుకొని వెళ్లిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన వేలిముద్రలు సరిపడకపోవడంతో వారి హాజరు నమోదుపై సందిగ్ధం నెలకొంది. రోజువారీగా పర్యవేక్షణ చేయాల్సిన మండల విద్యాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొందరు ఉపాధ్యాయులు ఉద్దేశపూర్వకంగా బడులకు డుమ్మా కొడుతున్నా.. చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో సిగ్నళ్ల సమస్యలతో అనేక పాఠశాలల్లో ఈ పరికరాలను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ కంపెనీ చరవాణి సిగ్నల్‌లు ఎక్కువగా రాగా.. అధికారులు ఇచ్చిన సిమ్‌లు ఇతర కంపెనీలవి కావడంతో అవి పనికిరావడం లేదు. వీటితో పాటు అనేక చోట్ల బ్యాటరీలు పనిచేయడం లేదని చెబుతున్నారు. మరికొన్ని చోట్ల విద్యుత్తు సమస్య కారణంగా పరికరాలు పని చేయడం లేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. సిగ్నల్‌ సమస్యలు ఉన్నప్పటికీ.. విద్యుత్తు సమస్యలు మాత్రం లేవని తెలుస్తోంది. ఫలితంగా సర్కారు బడుల్లో బయోమెట్రిక్‌ యంత్రాల హాజరు కలగా మారుతోంది. రెండు రోజుల క్రితం జిల్లాలోని హజరుశాతాన్ని రాష్ట్రస్థాయిలో పరిశీలించగా విస్మయం చెందే విషయాలు బయటపడ్డాయి. ఆ రోజున 7 శాతం మాత్రమే హాజరు నమోదైనట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. జిల్లాలో బయోమెట్రిక్‌ హాజరు నిర్వహణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజువారీగా పర్యవేక్షిస్తూ గాడిలో పెట్టాల్సిన అధికారులు..పూర్తి స్థాయిలో దృష్టిసారించకపోవడంతో కొందరు ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కొందరు ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లోకి మార్చడంతో అక్కడ వారి వివరాలు సరిపోల్చకపోవడంతో కచ్చితమైన హాజరుకు అవరోధాలు ఏర్పడుతున్నాయని తెలుస్తోంది.