గులాబీ పార్టీలో తెరపైకి వినోద్ పేరు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గులాబీ పార్టీలో తెరపైకి వినోద్ పేరు


హైద్రాబాద్, జూలై 2, (way2newstv.com)

మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్‌కు మంత్రి మండలిలో చోటు లభిస్తుందా?’ ఇప్పుడు ఏ నోటా విన్నా ఇదే ప్రశ్న. టీఆర్ఎస్ పార్టీ రెండో సారి అధికారం చేపట్టాక సీఎం కేసీఆర్ వీరిద్దరికి మంత్రి పదవి ఇవ్వలేదు. కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పజెప్పినా.. హరీష్‌కు మాత్రం ఏ పదవీ దక్కలేదు. దీంతో మంత్రి వర్గ విస్తరణలో భాగంగా వీరికి అవకాశం దక్కే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఇప్పుడు సీఎం కేసీఆర్ మరో విధంగా ఆలోచిస్తున్నారా? హరీష్‌, కేటీఆర్‌లను ఇద్దరినీ కాదని మరో నేతకు అవకాశం ఇస్తారా? వెలమ సామాజిక వర్గానికి చెంది, పార్టీ సీనియర్ నేత అయిన వినోద్‌ను తెరపైకి తీసుకు రావాలని కేసీఆర్ యోచిస్తున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే జవాబిస్తున్నాయి.



గులాబీ పార్టీలో  తెరపైకి వినోద్ పేరు

ఈ చర్య వల్ల సీనియర్ నేతకు అవకాశం కల్పించినట్లు అవడంతో పాటు, హరీష్‌, కేటీఆర్‌ల గురించి పెద్దగా చర్చ ఉండదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వినోద్‌కు అవకాశం కల్పించి, బావ, బావమరిదిని పక్కనపెడితే.. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గానే తన పనులను కొనసాగిస్తారు. హరీష్ మాత్రం సాధారణ ఎమ్మెల్యేగానే ఉంటారు.ఇక, వినోద్ విషయానికి వస్తే.. ఆయన పార్టీలో సీనియర్ నేత. వెలమ సామాజిక వర్గంలో పట్టున్న నాయకుడు. మాజీ ఎంపీ. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో పరాజయం పాలైన వినోద్.. కేసీఆర్‌కు దగ్గరి మనిషి. రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న నేత. ఈయన్ను మంత్రి వర్గంలోకి తీసుకుంటే పలు అంశాల్లో కలిసి వస్తుందన్న ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్ నాయకుడు అయినందున పాలనలో కలిసి వస్తుందని, బలమైన నాయకుడి మాటకు విలువ ఉంటుందన్న ఉద్దేశంతో వినోద్‌ను తెర మీదకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.