తెలంగాణలో బలపడేందుకు టీడీపీ ప్లాన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో బలపడేందుకు టీడీపీ ప్లాన్

హైద్రాబాద్, జూలై 27, (way2newstv.com)
త్వరలో తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీని సమాయత్తం చేయాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో లేకపోవడంతో కొంత సమయం పార్టీ కోసం వెచ్చించే వీలుచిక్కింది. తెలంగాణలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురయింది. కేవలం ఖమ్మం జిల్లాలో రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది.అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉండటంతో చంద్రబాబునాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీని పట్టించుకోలేదు. తెలంగాణలో ఇప్పటికే పార్టీకి నెలవారీ దాదాపు పదిలక్షల పైగానే ఖర్చు చేస్తున్నారు. ముఖ్యనేతల ఖర్చులతో పాటు సిబ్బంది జీతభత్యాల కు ఈమొత్తాన్ని తెలుగుదేశం పార్టీ వెచ్చిస్తుంది. 
తెలంగాణలో బలపడేందుకు టీడీపీ ప్లాన్

తెలంగాణాలో కోల్పోయిన పట్టును తిరిగి సాధించుకోవాలన్న పట్టుదల చంద్రబాబునాయుడులో కన్పిస్తోంది.అందుకే త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను పోటీ చేయించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఈ మేరకు సీనియర్ నేతలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలంటే పట్టణాలే ఉన్నందున అక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందన్నది చంద్రబాబునాయుడు ఆలోచన. కనీస స్థానాలను సాధించుకోగలిగితే కొంత కార్యకర్తల్లో, నేతల్లో మనోస్థైర్యాన్ని నింపిన వాళ్లమవుతామని ఆయన భావిస్తున్నారు.ఇప్పటికే ప్రతి శని, ఆదివారాల్లో చంద్రబాబునాయుడు అమరావతి నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ రెండురోజుల్లో తెలంగాణ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల్లో గట్టి అభ్యర్థులను నిలబెట్టాలన్నది చంద్రబాబునాయుడు ఆలోచనగా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేయాలన్న కొందరి నేతల అభిప్రాయాలను చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు. కోదండరామ్ సారథ్యంలోని తెలంగాణ జన సమితితో కలసి వెళ్తే తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు నేతలతో చెప్పినట్లు తెలిసింది. లేకుంటే ఒంటరిగానే మున్సిపల్ ఎన్నికలు వెళ్లాలని చంద్రబాబునాయుడు ఆదేశించినట్లు తెలిసింది.