గుక్కెడు నీరులేక..(అనంతపురం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గుక్కెడు నీరులేక..(అనంతపురం)

అనంతపురం, జూలై 9(way2newstv.com): 
పేద విద్యార్థుల గొంతెండుతోంది. మధ్యాహ్న భోజనం చేసి నీరు తాగాలంటే సుదూరం వెళ్లాల్సిన దుస్థితి. జిల్లాలోని ఆయా పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం ఉన్నవి, నీరున్నా మరుగుదొడ్లకు వినియోగించడానికి అనుకూలంగా లేనివి, అసలు నీరే లేనివి, మరమ్మతులు చేయించాల్సినవి, పంచాయతీ నుంచి నీరు సరఫరా అయ్యే పాఠశాలల వివరాలను లెక్క తీశారు. సగాని కంటే ఎక్కువ పాఠశాలల్లోనే ఏదో ఒక సమస్య వెంటాడుతున్నట్లు తేటతెల్లమైంది. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమై 15 రోజులు దాటింది. వివిధ పాఠశాలల్లో విద్యార్థి లోకం గుక్కెడు నీటి కోసం తల్లడిల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం భోజనం చేసే సమయంలో నీరు లేకపోవడంతో ఇంటి వద్ద నుంచి నీటి సీసాలు తెచ్చుకుంటున్నారు. మరికొన్ని పాఠశాలల్లో తిన్న అన్నం ప్లేట్లను చేతిలో పట్టుకొని సమీప ప్రాంతాలకు వెళ్లాల్సిన దయనీయ స్థితిని విద్యార్థి లోకం ఎదుర్కొంటోంది.
గుక్కెడు నీరులేక..(అనంతపురం)


జిల్లాలో 378 పాఠశాలల పరిధిలోని పంచాయతీల్లో నీరున్నా పాఠశాలలకు అందివ్వడం లేదు. కనీసం గుక్కెడు నీరు అందదు. సంబంధిత పంచాయతీల నుంచి కొళాయి కనెక్షన్‌ ఇవ్వాల్సి ఉంది. అనేక పర్యాయాలు సంబంధిత అధికారులను ఎస్‌ఎస్‌ఏ ఇంజినీరింగ్‌ విభాగం నుంచి కోరినా నీటి కనెక్షన్‌ పూర్తి స్థాయిలో ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో విద్యార్థులకు గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదు. చాలా పాఠశాలల్లో నిర్వహణ లోపమే శాపంగా మారుతోంది. పాఠశాలలకు భద్రత లేకపోవడంతో ఆకతాయిలు పైపులను ధ్వంసం చేస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు నిర్వహణ పూర్తిగా విస్మరించారు. జిల్లాలో వివిధ పాఠశాలల్లో బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. ఇక నీరున్నా నిర్వహణ లోపంతో విద్యార్థులకు అందడం లేదు. ఆయా పాఠశాలల్లో కనీసం చిన్న చిన్న మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. దీంతో వాటిని అలాగే వృథాగా వదిలేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించి... నీరున్నా నిర్వహణ లేక దాహం తీరడం లేదు. మరికొన్ని పాఠశాలల్లో నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు.