రెండున్నర లక్షల కోట్లతో బడ్జెట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెండున్నర లక్షల కోట్లతో బడ్జెట్

విజయవాడ, జూలై 9, (way2newstv.com)
ఆర్థిక వనరులకు అనుగుణంగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను కుదించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆశిస్తున్న ఆదాయానికి, వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలకు మధ్య పొంతన లేకపోవడంతో కేటాయింపులు ఎలా చేయాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. నవరత్నాల అమలుకు నిధుల కొరత ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో బడ్జెట్ కూర్పుపై మేధోమథనం జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 9నెలలకు సంబంధించి బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ నెల 12న అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు వేగం పుంజుకుంది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వరుస సమావేశాలు నిర్వహించి ప్రతిపాదనలు స్వీకరించారు. ఆయా శాఖలు అందించిన ప్రతిపాదనల విలువ దాదాపు రూ.2.5 లక్షల కోట్ల మేర ఉంది. 
రెండున్నర లక్షల కోట్లతో బడ్జెట్

ఇంధన శాఖ రూ.24,330 కోట్లు, రహదారులు - భవనాల శాఖ రూ.4,058 కోట్లు, రెవెన్యూ శాఖ రూ.1,671 కోట్లు, జలవనరుల శాఖ రూ.18వేల కోట్లు, రవాణా శాఖ రూ.3,904 కోట్ల మేర ప్రతిపాదనలు అందజేశాయి. అయితే వివిధ పద్దుల కింద ఆదాయం రూ.1.9 లక్షల కోట్లు మాత్రమే వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్ కూర్పుపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇటీవల సమీక్షిస్తూ.. నవరత్నాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిధుల కొరత ఉండకూడదని స్పష్టం చేయడం తెలిసిందే. నవరత్నాల అమలుకు సంవత్సరానికి రూ.73వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. 9నెలలకు రూ.50వేల కోట్ల మేర కేటాయించాల్సి ఉంటుందని లెక్కలు తేల్చారు. వాస్తవ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను 2.17 లక్షల కోట్లకు కుదించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో సింహభాగం నవరత్నాలకు కేటాయించి మిగిలిన పద్దుల కింద ఖర్చులు ఎలా సర్దుబాటు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. కేంద్రం నుంచి ఆశించిన మేర నిధులు వచ్చే అవకాశాలు లేకపోవడంతో, అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతోనే వాస్తవానికి దగ్గరగా ఉండేలా బడ్జెట్‌ను రూపకల్పన చేయటంపై ప్రభుత్వ పెద్దలు, అధికారులు దృష్టి సారించారు.