పెరుగుతోన్న కాలుష్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పెరుగుతోన్న కాలుష్యం

అనంతపురం, జూలై 26, (way2newstv.com)
అనంతపురం నగరంలో కాలుష్యం తారస్థాయికి చేరుకుంది. ఎగిసి పడుతున్న దుమ్ముతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనారోగ్యం చుట్టుముడుతుండడంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అనంతపురంలోని రాం నగర్‌ సమీపంలో ఫై ఓవర్‌ పనులు సాగుతున్న నేపథ్యంలో అటుగా వెళ్లాలంటే చాలా మంది జంకుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ మునిసిపల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ కింద అన్ని కాలనీల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ఇంట్లోంచి బయటకు రావాలంటే స్థానికులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. 
పెరుగుతోన్న కాలుష్యం

నగరంలో వాహనాల రద్దీ మరీ ఎక్కువగా ఉంది.  టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్, పాతూరు, కలెక్టరేట్, కమలానగర్, సాయినగర్‌ తదితర ప్రాంతాల్లో వాహనాల నుంచి వెలువడే వాయువులు మనిషిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో నివాస గృహాల నుంచి బయటకు వచ్చేందుకు స్థానికులు భయపడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరంలో అత్యధికులు ఊపిరితిత్తులు, కంటి, శ్వాసకోస వ్యాధుల బారిన పడే ప్రమాదముంది.దుమ్ము ధూళి కణాలు నేరుగా కళ్లలో పడడంతో జనం పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కళ్ల నుంచి నీరు కారడం, కళ్లు మంటగా ఉండడం,  ఎర్రబారడం వంటి రుగ్మతలతో ఆస్పత్రుల బాట పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దుమ్ము ధూళి కణాలు కళ్లలో పడి కళ్లు మసకబారుతున్న 120 మంది వరకు నిత్యమూ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని కంటి విభాగానికి చికిత్స కోసం వస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్‌ కంటి ఆస్పత్రులను ఆశ్రయించే వారు దీనికి రెండింతలు ఉంటారని అంచనా. దుమ్ము ధూళి పడిన వెంటనే కళ్లను శుభ్ర పరచకుండా నలుపుతుండడంతో సమస్యలు తీవ్రమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు కంటి పైపొర దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.నగరంలో దుమ్ముధూళి ఎక్కువగా ఎగిసి పడుతోంది. చిన్న పిల్లలను తీసుకుని బయటకు రావాలంటే భయమేస్తోంది. ఫ్లై ఓవర్‌ పనులు జరుగుతున్న చోట అయితే పరిస్థితి మరీ ఘోరం. అసలు ఈ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియడం లేదు. నేను ఇక్కడే చిన్నపాటి వ్యాపారం చేసుకుంటుంటాను. ఈ దుమ్ముతో ఇటువైపు వచ్చే వాళ్లే తగ్గిపోతున్నారు. నా వ్యాపారం దుమ్ముకొట్టుకుపోతోంది.