వర్షాలతో పంటలు కళకళ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వర్షాలతో పంటలు కళకళ

కరీంనగర్, జూలై 22, (way2newstv.com
సీజన్ ప్రారంభంలో ముఖం చాటేసిన వర్షాలు ప్రస్తుతం అనుకూలంగా మారుతున్నాయి.  మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు. జూన్‌లో చెప్పుకోదగిన రీతిలో వర్షాలు కురియలేదు. ఆ నెలలో 11న 15.8, 12న 7.4, 23న 20.2, 28న 33.7 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఆ నెల సాధారణ వర్షపాతం 115.3 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 117.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో చాలా మంది రైతులు పత్తి విత్తుకున్నారు. జూన్‌లో 40 శాతం పంటలు సాగు చేసుకున్నారు. ఈ నెలలో చూస్తే ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 70.5 మిల్లీ మీటర్లు కాగా ఇప్పటికే 132.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో ఈ నెలలో పంటల సాగు క్రమంగా పెరుగుతోంది. ఈ నెల 6 నుంచి వర్షాలు కురుస్తున్నాయి.
వర్షాలతో పంటలు కళకళ

6న 48.4, 7న 31.3, 8న 6.0, 9న 26.1, 10న 10.1 మిల్లీ మీటర్ల చొప్పున చెప్పుకో తగిన రీతిలో వర్షపాతం నమోదైంది.సాగుకు కీలకమైన ఈ నెలలో వర్షాలు అనుకూలిస్తున్న నేపథ్యంలో రైతులు పంటల సాగుపై దృష్టి సారించారు. గత నెలలో కేవలం 40 శాతం మాత్రమే సాగవగా ఈ నెలలో ఇప్పటి వరకు 57 శాతానికి పంటల విస్తీర్ణం చేరుకుంది. ఇందులో ప్రధానంగా పత్తిసాగు 95 శాతానికి చేరింది. సాధారణ సాగు 53,080 హెక్టార్లు కాగా ఇప్పటికే 50,499 హెక్టార్లలో సాగు చేశారు. ఆ తర్వాత మక్క జొన్న సాధారణం 13,753 హెక్టార్లకు 6,930 హెక్టార్లలో వేశారు. ఈ పంట ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ఇక ఇప్పటి వరకు కేవలం 5 శాతం మాత్రమే వరి నాట్లు వేసుకున్నారు. వరి సాధారణ విస్తీర్ణం 37,790 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు కేవలం 1,930 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. ఈ నెలలో వరి విస్తీర్ణం బాగా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా ఈసారి రైతులు పసుపు పంటను సాధారణంకంటే ఎక్కువగా సాగు చేశారు. ఈ పంట 126 హెక్టార్లు సాధారణ సాగు కాగా 155 హెక్టార్ల వరకు వేశారు. అంటే 123 శాతానికి ఈ పంట విస్తీర్ణం చేరుకుంది. పెసర 39, కంది 61, చొప్పున జిల్లాలో 57 శాతం సాగయ్యాయి.జిల్లాలో ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో సాగు చేసిన పత్తి, మక్క జొన్న పంటలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కాస్త ప్రతికూలమేనని వ్యవసాయశాఖ అధికారులు, సైంటిస్టులు చెబుతున్నారు. ఈ నెల 6 నుంచి జిల్లా వ్యాప్తంగా ముసురు కమ్ముకోవడం, వర్షపు నీరు చేలల్లో నిలవడం రైతులకు నష్టం కలిగిస్తాయని వారు అంటున్నారు. ఇప్పటికే 95 శాతం చేరుకున్న పత్తి సాగు అక్కడక్కడ కలుపునకు వచ్చింది. మక్క పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఈ రెండు పంట చేలల్లో అక్కడక్కడా నీళ్లు నిలుస్తున్న విషయాన్ని గమనించిన అధికారులు రైతులకు ఎక్కడికక్కడ సూచనలు ఇస్తున్నారు. సాల్లలో నిలిచిన మురుగు నీటిని కాలువల ద్వారా బయటికి పంపించాలని, నీళ్లు అలాగే ఉంటే ఆకుమచ్చ, ఎండు తెగులు ఆశించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.