రోడ్లు,భవనాల శాఖకు ఫుల్ గిరాకీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రోడ్లు,భవనాల శాఖకు ఫుల్ గిరాకీ


హైద్రాబాద్, జూలై 4, (way2newstv.com)
రోడ్లు భవనాల శాఖ (ఆర్ అండ్ బీ)కి ఫుల్లు గిరాకీ ఉంది. ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు ఆర్ అండ్ బీకి దక్కుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో మస్తు బిజీ బిజీ శాఖగా మారిపోయింది. ఇప్పటిదాకా జాతీయ, రాష్ట్ర రహదారులకే పరిమితమైన ఆర్ అండ్ బీ, రాష్ట్రం వచ్చాక అన్ని ముఖ్య ప్రాజెక్టులనూ చేపడుతోంది. ఇటీవలే ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణాన్ని ఆర్ అండ్ బీ పూర్తి చేసింది. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు, జిల్లా కలెక్టరేట్లు నిర్మిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్నూ ఆర్ అండ్ బీనే కడుతోంది. వచ్చే నెల నుంచి సెక్రటేరియెట్, అసెంబ్లీ నిర్మాణంలోనూ భాగం కాబోతోంది. వాటితో పాటు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో సగం ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. త్వరలో మిగతా ప్రాజెక్టుకూ ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణానికీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటికి ఆమోదం వస్తే ఆ ప్రాజెక్టూ ఆర్ అండ్ బీనే వరించనుంది.కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు ప్రస్తుతం టెండర్లు, డిజైన్ల వంటి పనుల్లో అధికారులు తలమునకలయ్యారు. 

రోడ్లు,భవనాల శాఖకు ఫుల్ గిరాకీ

ఇప్పుడు సచివాలయం ఉన్న చోటే కొత్త సచివాలయం కట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో పాత భవనాన్ని కూలగొట్టే అంశంపై త్వరలోనే ఆర్ అండ్ బీ అధికారులు సమావేశం కాబోతున్నారు. మొత్తం ఒకేసారి కూల్చాలా లేదా బ్లాకుల వారీగా కూల్చాలా అన్నదానిపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సచివాలయం చుట్టూ రోడ్లు ఉండడంతో కూల్చేటప్పుడు దుమ్ము, ధూళి, ట్రాఫిక్, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ అంశాలపై సీఎస్, డీజీపీ, ట్రాఫిక్, జీఏడీ అధికారులతో ఆర్ అండ్ బీ అధికారులు చర్చించనున్నారు. ఇక, ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టుల్లో కొన్ని చివరి దశకు చేరుకున్నాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు 90 చోట్ల పూర్తయ్యాయి. మరో 10 చోట్ల భూసేకరణలో ఇబ్బందుల వల్ల పనులు మొదలవలేదు. హైదరాబాద్ బంజారాహిల్స్లో కడుతున్న కమాండ్ కంట్రోల్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దసరాకు ముందే ప్రారంభించే అవకాశాలున్నాయి. 28 జిల్లాల్లో కడుతున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణమూ మరో 3 నెలల్లో పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. లుంబిని పార్కు వద్ద కడుతున్న అమరవీరుల స్మారక భవనం కూడా డిసెంబర్ లోపు పూర్తవుతుందని సమాచారం.ఒకేసారి భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వామి అయిన రోడ్లు భవనాల శాఖలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా పలువురు అధికారులకు పదోన్నతులు రావాల్సి ఉంది. రాష్ట్రం ఏర్పడ్డాక 2016 మార్చి నెలలో రోడ్లు భవనాల శాఖలో 82 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసింది. 2012 తర్వాత ఖాళీలు భర్తీ చేయడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. రెండు నెలల క్రితం సివిల్ విభాగంలో పలువురు ఏఈల పదోన్నతులకు సంబంధించిన ఫైల్ను ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. 106 ఏఈ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ప్రభుత్వం అంగీకరించినట్లు అధికారులు చెబుతున్నారు.