దిక్కుతోచని రైతన్న.. (ఖమ్మం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దిక్కుతోచని రైతన్న.. (ఖమ్మం)

ఖమ్మం, జూలై 24 (way2newstv.com): 
మట్టిని నమ్ముకున్న రైతుకు వరుణుడు సకాలంలో సాయపడలేకపోతున్నాడు. వేసిన పంటలు దక్కే పరిస్థితి కనిపించకపోవటంతో వారి మోములో ఆనందం కరవైంది. పచ్చని పైరుతో కళకళలాడాల్సిన క్షేత్రాలు ఏడారిని తలపిస్తున్నాయి. తెలంగాణలో అత్యధిక లోటు వర్షపాతం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోనే ఉంది. సాధారణ సాగుకంటే చాలా తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగుచేశారు. వేసిన విత్తనాలను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. పొడి దుక్కిలో పెట్టిన విత్తనాలను చీమలు, పురుగులు తినగా, మిగతావి సరైన పదును లేక మట్టిపాలయ్యాయి. రెండు రోజులు నుంచి చిరుజల్లులు పడుతున్నా జరగాల్సిన నష్టం జరిగాక వచ్చి లాభమేంటంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
దిక్కుతోచని రైతన్న.. (ఖమ్మం)

తొలకరి వర్షం పడగానే ఎక్కువ మంది రైతులు పత్తి, పెసర, ఇతర పప్పుధాన్యాల పంటలను సాగు చేస్తారు. ప్రస్తుతం ఉభయ జిల్లాల్లో పూర్తి స్థాయిలో సాగులోకి రాలేదు. వర్షం సకాలంలో రాకపోవడంతో పత్తి విత్తనాలు కేవలం 40 శాతం మాత్రమే మొలకెత్తాయి. విత్తనాలను పొడి దుక్కిలో వేయడం వల్ల చీమలు, పురుగులకు మేతగా మారాయి. మరికొన్ని సరైన పదును లేక మొలక వచ్చి ఎండిపోయాయి. దీంతో రైతులు మొలక రానిచోట మళ్లీ విత్తనాలు పెడుతున్నారు. మరోవైపు చిరుజల్లులు తప్ప పెద్ద వర్షం లేదు. చిరుజల్లులతో ఏర్పడే తేమ విత్తనానికి సరిపోక అది మొలక వచ్చే పరిస్థితులు ఏర్పడటం లేదు. వెంటనే పొడి వాతావరణం ఏర్పడుతుండటంతో భిన్న వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక ఎండిపోతున్నాయి. దీంతో ఒక్కో రైతు రెండు నుంచి మూడుసార్లు విత్తనాలు నాటిన పరిస్థితి ఉంది.పత్తి విత్తనాలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. పైపులు కొనుగోలు, మోటార్లను అద్దెకు తీసుకుని నీటి తడులు ఇవ్వడం వంటి పనులతో యత్నిస్తున్నారు. కిలోమీటర్ల దూరం పైపులు వేసి నీటిని తీసుకొచ్చి మొక్కల దగ్గర పోస్తున్నారు. మోటారు అద్దెకు తీసుకున్నందుకు రూ.వెయ్యి, కిరోసిన్‌, డీజిల్‌కు సుమారు రూ.500 వరకు ఖర్చుచేస్తున్నారు. మరోవైపు మార్కెట్‌లో పైపులను కొనుగోలు చేసే రైతుల సంఖ్య అమాంతం పెరిగింది. నీటితడులు, ఇతర ఖర్చుల నిమిత్తం ఎకరానికి రూ.2500 నుంచి రూ.3500 వరకు అదనంగా ఖర్చుచేస్తున్నారు. మరోవైపు కొందరు పత్తిని తొలగించి మిరప సాగుకు సన్నద్ధమవుతున్నారు. పత్తి విత్తనాలు మళ్లీ విత్తే బదులు మిరపకు ఇంకా సమయం ఉండటంతో దాని సాగుకు సుముఖత చూపుతున్నారు. గత రెండు రోజులుగా ఉభయ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి.. అయితే జరగాల్సిన నష్టం జరిగాక ఇప్పుడు వర్షాలు పడటం వల్ల విత్తన మొలక పరంగా లాభం ఉండదని రైతులు వాపోతున్నారు. 60 శాతం విత్తనాలు మట్టిపాలయ్యాక, ఇప్పుడు జల్లులు పడిన లాభం లేదు. ఒక వేళ మళ్లీ విత్తనాలు పెడితే ముందుగా వేసిన పంటకు, ఇప్పుడు వేసిన విత్తనాలకు మధ్య వ్యవధి నెల రోజుల వరకు ఉంటుంది. దీనివల్ల పంటంతా సమాంతరంగా ఉండక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. దిగుబడులపై ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. మొలిచిన పత్తి మొక్కలకు రసాయన ఎరువులు వేయాల్సి రావడం, మరోవైపు రాని చోట విత్తనాలు వేయడం వంటి భిన్న పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు.