కరీంనగర్, జూలై 18 (way2newstv.com):
మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడక ముందే ముందస్తు రాజకీయాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తున్నాయి. అన్ని పార్టీలు కీలక సంగ్రామంగా భావిస్తున్న పురపోరుపైనే ప్రధాన దృష్టి సారిస్తున్నాయి. ఓ వైపు కార్పొరేటషన్, మున్సిపాలిటీల యంత్రాంగం ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను చకచకా పూర్తిచేస్తుండగా.. మరోవైపు పీఠమే పరమావధిగా భావించే నాయకగణం బరిలో నిలవాలనే ఆశల్ని చూపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న అవకాశాన్ని టికెట్ రూపంలో అందుకోవాలనే ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇందుకోసం ఆయా పార్టీల్లోని ఆశావహ నాయకులు ఆశల లోకంలో విహరిస్తున్నారు. కరీంనగర్, రామగుండం రెండు నగరపాలక సంస్థలు, 8 పాత పురపాలికలతోపాటు నాలుగు జిల్లాల్లో ఆరు కొత్త పురపాలికల్లోనూ అసలైన సందడి అప్పుడే కనిపిస్తోంది. త్వరలో ఖారరయ్యే రిజర్వేషన్లతో తమకే అవకాశాలుంటాయనేలా పలువురు నాయకులు ఆయా డివిజన్‌ల పరిధిలో జోరు చూపిస్తున్నారు.
ఎన్నికల వేడి షురూ.. (కరీంనగర్)
బల్దియా ఎన్నికల వార్డుల రిజర్వేషన్లు ఇంకా ప్రకటించనేలేదు. షెడ్యూల్ కూడా ఖరారు కాలేదు.. అయినా కొందరు ఔత్సాహికులు తమ పార్టీ నుంచి తనకే టికెట్ ఖాయమనే తీరుని ఆయా పురపాలికల్లో చూపిస్తున్నారు. మొన్నటి వరకు పాలకవర్గంలో బాధ్యతల్ని నిర్వర్తించిన నేతలతోపాటు కొత్తగా టికెట్‌ను ఆశిస్తున్న వారి తాకిడి ఈ పార్టీలో అధికంగానే కనిపిస్తోంది. మరోవైపు తెరాసతోపాటు భాజపా, కాంగ్రెస్ పార్టీలు కూడా కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలోని పుర పీఠాల్ని కైవసం చేసుకునేలా ముందుకు అడుగులేస్తున్నాయి. నగర, పురపాలికల్లో ప్రధాన పార్టీల తరపున రంగంలో నిలిచేందుకు నాయకగణం ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో గెలిచి పాలనతీరులో భాగమైన సిట్టింగ్‌ల్లో ఎక్కువ మంది మరోసారి తమకు రిజర్వేషన్ అనుకూలిస్తుందని.. ఎట్టిపరిస్థితుల్లో పోటీ చేయాలనే భావనను కనబరుస్తున్నారు. ఆశించిన డివిజన్‌తోపాటు అనుకూలంగా ఉండే ఇతర స్థానాల్లోనూ పోటీకి సై అనేలా చతురతను ఇప్పటి నుంచే పార్టీ అగ్రనాయకుల వద్ద చూపిస్తున్నారు. కొత్తగా పోటీపట్ల ఆసక్తిని చూపించే వారి సంఖ్య కూడా అన్ని పట్టణాల్లో క్రమంగా పెరుగుతోంది. ప్రజలతో ఉన్న సత్సంబంధాలు తమకు కలిసి వస్తాయనే తీరుతో పోటీ దిశగానే దృష్టిని చూపిస్తున్నారు. అనుచరుల వద్ద టికెట్ పొందుతామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా కాలనీల్లో, బస్తీల్లోని పెద్దలు సహా కులసంఘాల వారికి పోటీ ఖాయమనే తీరుని మాటల్లో చెప్పకనే చెబుతున్నారు. అయితే తాను లేదంటే తన సతీమణి పోటీలో ఉంటుందనే విషయాన్ని కూడా ముందస్తుగానే తెలియపరుస్తున్నారు. పట్టణ ప్రాంతంలో కీలకమైన కార్పొరేటర్, కౌన్సిలర్‌గా పోటీచేయడాన్ని ఆయా పార్టీల నాయకులు సవాలుగా తీసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందనే ఆశాభావంతో ముందస్తుగానే జోరుని పెంచుతున్నారు. ప్రధానంగా ఇప్పుడున్న సొంత పార్టీలోనే టికెట్ కోసం శతవిధాల ప్రయత్నాల్ని చేస్తున్నారు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైన దరిమిలా పక్క పార్టీలోకి మారైనా సరే పోటీకి సై అనేందుకు సమాయత్తమవుతున్నారు. ఉన్నఫలంగా నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఎక్కువగా సమయం ఉండకపోవడం అప్పటికప్పుడు అభ్యర్థుల వెతుకులాట సహా ఇతరత్రాలుగా ఎదురయ్యే ఇక్కట్లను తట్టుకునేందుకు ముందస్తుగానే అభ్యర్థుల విషయంలో ఓ అంచనాలో పార్టీలున్నాయి. తమ పార్టీలోని బలమైన నాయకుడికి టికెట్ ఇవ్వడం లేదా.. అనివార్యమైన చోట పక్క పార్టీలోని మంచి నాయకుడికి గాలం వేసి పార్టీలోకి ఆహ్వానించడం లాంటి ప్రయత్నాల్ని అన్ని పార్టీలు చేపట్టబోతున్నాయి. మరోవైపు నాయకులు కూడా తమ కళ్లముందున్న రాజకీయ వాతావరణానికి అనుగుణంగా వలసలకు తెరతీయనున్నారు. తమ సొంత పార్టీలో టికెట్ లభించకపోతే ఇతర పార్టీలో టికెట్ వచ్చేలా తమ టికెట్ రిజర్వు అయ్యేలా ముందస్తుగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారనే ప్రచారం కూడా అక్కడక్కడ వినిపిస్తోంది.
Tags:
telangananews