రూల్సా..? అంటే ఏంటీ..? (తూర్పుగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రూల్సా..? అంటే ఏంటీ..? (తూర్పుగోదావరి)

కాకినాడ, జూలై 9 (way2newstv.com): 
జిల్లాలోని ప్రధాన నగరాల్లోని బహుళ అంతస్తుల భవనాల సెల్లార్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు కొనసాగుతున్నా యంత్రాంగం వాటివైపు కన్నెత్తి చూడడం లేదు. ఇప్పటివరకు కేవలం తాఖీదులిచ్చి చేతులు దులుపుకొన్నారు. ఈ పరిస్థితుల్లో వాహనాలు నిలపడానికి నిర్దేశించిన సెల్లార్లను వ్యాపార అవసరాలకు అద్దెలకిస్తూ యజమానులు సొమ్ము చేసుకుంటుంటే.. గత్యంతరం లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్న ప్రజలు మాత్రం పోలీసుల ఆగ్రహానికి గురై మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. జిల్లా కేంద్రం కాకినాడతో పాటు.. కీలకమైన రాజమహేంద్రవరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రెండు ప్రధాన నగరాల్లోనూ జనాభాతో పాటు వాహనాల రద్దీ పెరగడం.. రద్దీగా మారుతున్న ఆయా ప్రాంతాలకు అనుబంధంగా ప్రత్యేక పార్కింగ్‌ వ్యవస్థలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలతోపాటు ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలున్నాయి. 
రూల్సా..? అంటే ఏంటీ..? (తూర్పుగోదావరి)


అమలాపురం గ్రేడ్‌-1 మున్సిపాలిటీ కాగా.. తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం గ్రేడ్‌-2 కిందికి వస్తాయి. ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం నగర పంచాయతీలున్నాయి. వీటన్నింటిలో వేలాది వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ సమస్యలతో జనం నానా అవస్థలు పడుతున్నారు. స్థానిక సంస్థల నిర్లక్ష్యం పోలీసులకు శిరోభారంగా మారుతోంది. వ్యాపార సముదాయాలకు.. ఆయా భవనాల నిర్మాణాలకు అనుమతులిస్తున్న యంత్రాంగం నిబంధనలకు అనుగుణంగా సెల్లార్ల ఏర్పాటుపై మాత్రం దృష్టి పెట్టడంలేదు. వీటిపై అధికారిక లెక్కలకు వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాణిజ్య సముదాయాల్లో కార్లు, ద్విచక్ర వాహనాల పార్కింగుకు కొంత స్థలం కేటాయించాల్సి ఉన్నా.. చాలాచోట్ల ఆ పరిస్థితి లేదు. సెల్లార్లను వ్యాపార సముదాయాలకు అద్దెకిస్తూ చాలామంది సొమ్ము చేసుకుంటుంటే.. ట్రాఫిక్‌ పోలీసులు రికవరీ వ్యాన్లతో వచ్చి వాహనాలను తీసుకెళ్తున్నారు. అడపాదడపా కేసులు నమోదు చేసి ..మిగతా 7లోఅపరాధ రుసుం విధిస్తున్నారు.వాణిజ్య కేంద్రంగా పేరున్న రాజమహేంద్రవరంలో సెల్లార్ల దందా దర్జాగా సాగుతోంది. పెద్ద వ్యాపార సముదాయాలు, హోటళ్లు ఇతర సముదాయాలున్న ఇక్కడ పార్కింగ్‌ స్థలాల కొరత కనిపిస్తోంది. వ్యాపార సముదాయాలకు సెల్లార్లు తప్పనిసరి అనే నిబంధన జాడే లేదు. కొద్దిమంది మినహా మిగిలినచోట్ల అతిక్రమణే కనిపిస్తోంది. నగరపాలక సంస్థ కమిషనర్‌గా విజయరామరాజు పనిచేసిన కాలంలో సెల్లార్లపై కఠినంగా వ్యవహరించారు. నిబంధనల అతిక్రమణను గుర్తించి కొన్నింటిపై చర్యలు తీసుకున్నారు. ఆయన వెళ్లాక వాటిపై దృష్టిసారించే వారే కరవయ్యారు. దీంతో గతంలో సెల్లార్లు ఏర్పాటు చేసినవారు కూడా మళ్లీ వాటిని దుకాణాలుగా మార్చేశారు. నూతన నిర్మాణాల్లోనూ ఆ ఊసే లేకపోవడం గమనార్హం. గతంలో రాజమహేంద్రవరంలో 169 కమర్షియల్‌ కాంప్లెక్సులకు సెల్లార్లు లేకపోవడాన్ని అధికారులు గుర్తించినా.. కేవలం 66 అతిక్రమణలపైనే చర్యలు తీసుకోవడం గమనార్హం.స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రం కాకినాడను ట్రాఫిక్‌ చిక్కులు కమ్ముకుంటున్నాయి. నానాటికీ పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ కారణంగా రాకపోకల క్రమంలో సమస్యలు తెరమీదికి వస్తున్నాయి. కాకినాడలో ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలు లేక ఎక్కడికక్కడ రోడ్ల పక్కన ద్విచక్ర వాహనాలు, ఇతర భారీ వాహనాలు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా వ్యాపార సముదాయాల్లో సెల్లార్ల నిర్వహణ ఊసేలేదు. నిబంధనలు అతిక్రమించిన భవనాలు 75 వరకు గుర్తించినా.. చర్యల ఊసేలేదు. సెల్లార్లను వ్యాపార సముదాయాలకు వినియోగించినట్లు గుర్తించిన అధికారులు చర్యల్లో తాత్సారం కారణంగా పరిస్థితి మొదటికొస్తోంది. కాకినాడలోని నగరంలో కీలకమైన మెయిన్‌ రోడ్డులో వందల భవన నిర్మాణ సముదాయాలున్నాయి. కొద్ది భవనాల్లో మినహా మరెక్కడా సెల్లార్లను నిబంధనల ప్రకారం వినియోగించే ఊసేలేదు. సెల్లార్లను గదులుగా మార్చి నెలవారీ అద్దెలకిస్తున్నారు. కార్పొరేషన్‌ యంత్రాంగం అదేమని ప్రశ్నించడం లేదు. తాజాగా మెయిన్‌ రోడ్డు అభివృద్ధి చేసినా సెల్లార్లు అందుబాటులో లేక రోడ్లపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు. అడపాదడపా పోలీసులు కేసులు నమోదు చేస్తుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.మెయిన్‌రోడ్డుకు అనుసంధానంగా ఉన్న పెద్దమార్కెట్‌ ప్రాంతంలో రోడ్లపైకి దుకాణాలు చొచ్చుకురావడంతో రాకపోకల సమయంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దేవాలయం వీధిలోనూ భారీగా బహుళ అంతస్థుల్లో నడుస్తున్న వ్యాపార సముదాయాల్లో చాలావాటికి సెల్లార్లు లేవు. కాకినాడలోని భానుగుడి సెంటర్‌, నాగమల్లితోట, కోకిల కూడలి ప్రాంతాల్లోనూ సెల్లార్ల జాడ లేక రోడ్లకు అడ్డంగా వాహనాలు నిలిపే పరిస్థితి ఉంది. డాక్టర్‌నగర్‌, గుడారి గుంటలో పలు విద్యాలయాల ప్రాంగణాలదీ అదే పరిస్థితి.