రాజ్‌భవన్‌లో మొక్కలు నాటిన ఏపీ గవర్నర్‌

విజయవాడ జూలై 26 (way2newstv.com)
కార్గిల్ విజయ్‌ దివస్ సందర్భంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ఆయన సతీమణి  సుప్రబ హరిచందన్‌ రాజ్‌భవన్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్గిల్‌ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కార్గిల్‌ విజయ్‌ రోజున ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఈ మేరకు గవర్నర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఈ రోజు చిరస్మరణీయమైనది. కార్గిల్‌ను ఆక్రమించుకున్న పాకిస్తాన్‌ సేనల్ని భారత సైనికులు తిప్పి కొట్టిన రోజు. 
రాజ్‌భవన్‌లో మొక్కలు నాటిన ఏపీ గవర్నర్‌

మన సైనికుల వీరత్వానికి మనమంతా గర్వించాలి.
మన ప్రజలంతా కలిసికట్టుగా ఉండి దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. విజయ్‌ దివస్‌ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పౌరుడు ఈ ఏడాది కాలంలో ఐదు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేయాలి. పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకల్లో, వివిధ పండుగల జరుపుకునే క్రమంలో గుర్తుగా ఒక మొక్కను నాటండి. ఈ చిన్న ప్రయత్నం పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదం చేస్తుంది. చేయి చేయి కలుపుదాం. మొక్కలు నాటి..  మానవజాతిని కాపాడుదాం.. జైహింద్‌’ అని పేర్కొన్నారు.
Previous Post Next Post