మహబూబ్ నగర్, జూలై 24 (way2newstv.com):
అటవీ భూముల వివాదాలకు తెర పడటం లేదు. కొన్నిచోట్ల కబ్జాచేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల అటవీశాఖ అధీనంలోనే భూములు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన సరైన దస్త్రాలు రెవెన్యూశాఖ వద్ద లేవు. రెండు శాఖలు సమన్వయం చేసుకొని ఇప్పటికే నాలుగు వేల ఎకరాలపై స్పష్టత తీసుకువచ్చినా.. ఇంకా వేలాది ఎకరాల భూములపై స్పష్టత రావాల్సి ఉంది. కొన్నిచోట్ల అటవీ భూములను ఆక్రమించుకొని సాగుకు సిద్ధం చేసుకొంటుండగా.. అటవీశాఖ అధికారులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కబ్జాదారులు రాజకీయంగా ఒత్తిళ్లు తీసుకువస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.జిల్లాలోని అటవీ ప్రాంతంలో 33 శాతం భూములు ప్రస్తుతం వివాదాల్లో ఉన్నాయి. దీనిలో అత్యధికంగా కోయిలకొండ ప్రాంతంలోనే 9 వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉండటం గమనార్హం.
ఎడతెగని వివాదం ( మహబూబ్ నగర్)
మహబూబ్‌నగర్ మండల పరిధిలోని అప్పనపల్లి అటవీ ప్రాంతంలో సైతం భూమిని కబ్జాచేసి సాగు చేస్తున్నారు. స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే స్థానికులు ప్రతిఘటిస్తున్నారు. దీనికితోడు రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు. దీంతో చేసేది లేక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అటవీశాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారు.అటవీశాఖకు సంబంధించిన భూముల దస్త్రాలు సరిగ్గా లేవు. అటవీశాఖ వద్ద ఉన్నవాటికి, రెవెన్యూశాఖ వద్ద ఉన్న దస్త్రాలకు అసలు పొంతనలేదు. కొన్ని సంవత్సరాలుగా భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కరించాలని అటవీ అధికారులు కోరుతున్నా ఆ దిశగా అడుగు పడటం లేదు. పలుచోట్ల కబ్జా చేసుకొని సాగుచేసుకొంటున్న భూములను ఇటీవల రెవెన్యూ, అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. నాలుగు వేల ఎకరాల అటవీ భూమిగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖలో సిబ్బంది, అధికారుల కొరత తీవ్రంగా ఉంది. ప్రధానంగా బీట్ అధికారులతో పాటు పైస్థాయిలోనూ అధికారుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న అధికారులకు సైతం ఎక్కువ అటవీ ప్రాంతం పర్యవేక్షణకు బాధ్యతలు ఇచ్చారు. ఫలితంగా ఎక్కువగా అటవీ సంరక్షణపై వారు దృష్టి సారించడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వం 92 పోస్టులు మంజూరు చేస్తే కేవలం 30 మంది మాత్రమే పని చేస్తున్నారు. 62 పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. సుమారు 20 మంది బీట్ అధికారులు త్వరలో జిల్లాకు రానున్నారు. వీరికి నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అయినప్పటికీ జిల్లాలో ఉన్న ఇంకా సరిపడా సిబ్బంది లేరు.
Tags:
telangananews