తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు
అమరావతి జూలై 2 (way2newstv.com)
విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కుతున్నా..వారి సమస్యలను పట్టించుకోకుండా ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విత్తనాల కోసం రూ.380 కోట్లు ఇవ్వలేని ప్రభుత్వం.. రూ.వేల కోట్ల హామీలు ఎలా నెరవేరుస్తుందని ప్రశ్నించారు. నెలరోజుల్లోనే వైకాపా పరిపాలన ఏంటో జనాలకు బోధపడిందన్నారు.
నెలరోజుల్లోనే వైకాపా పరిపాలన ఏంటో జనాలకు బోధపడింది
రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొంటే..దీనిపై ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేయడం లేదని యనమల మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని వదలి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఇది కూల్చే ప్రభుత్వమే తప్ప, కాపు కాసే ప్రభుత్వం కాదని విమర్శించారు. పోలవరం పనులు నిలిచిపోయాయని, తిరిగి ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది వృద్ధి రేటు పడిపోయే అవకాశముందని యనమల హెచ్చరించారు. కమిటీల పేరిట రాజధాని నిర్మాణ పనులు ఆపేశారని ఆరోపించారు.