వీఐపీల దర్శనాల రద్దు... అదనంగా ఐదు వేల మందికి అవకాశం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వీఐపీల దర్శనాల రద్దు... అదనంగా ఐదు వేల మందికి అవకాశం

తిరుమల, జూలై 19 (way2newstv.com
వీఐపీ బ్రేక్ దర్శనాలను మూడు విభాగాలుగా విభజించడం పట్ల పలు విమర్శలు రావడంతో దీనిని రెండు రోజుల కిందట టీటీడీ రద్దుచేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం గురువారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విభజన రద్దువల్ల ఓ గంట సమయం ఆదా అవుతుంది. అంతేకాదు, అదనంగా ఐదువేల మందికిపైగా సామాన్యులకు శ్రీవారి దర్శనభాగ్యం కలుగుతోంది. వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్న భక్తులు సైతం సానుకూలంగా స్పందించడం విశేషం. వీఐపీ బ్రేక్ దర్శనం కింద గురువారం ఉదయానికి 2,904 టోకెన్లు టీటీడీ జారీచేసింది. వీరిలో 49 మంది ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులు ఉండగా, వారిని ఆలయానికి ముందుగా తీసుకెళ్లి హారతితో కూడిన శ్రీవారి దర్శనం చేయించి తీర్థం, శఠారీ మర్యాదలు చేసింది. 
వీఐపీల దర్శనాల రద్దు... అదనంగా ఐదు వేల మందికి అవకాశం

కేవలం 10 నిమిషాల్లోనే వీరికి దర్శనం చేయించారు. మిగతా భక్తులను తర్వాత ప్రవేశపెట్టి 1.50 గంటల వ్యవధిలో బ్రేక్‌ దర్శనం పూర్తి చేశారు. గురువారం ఉదయం తిరుమలలో రద్దీ సాధారణంగా ఉండడంతో ప్రొటోకాల్‌ ప్రముఖులకు మర్యాదలు చేయించి ఇతరులను కులశేఖరపడి వరకు అనుమతించారు. సాయంత్రానికి రద్దీ భారీగా పెరగడంతో శుక్రవారం కేవలం ప్రొటోకాల్‌ ప్రముఖులకే వీఐపీ దర్శనానికి అనుమతిస్తారు. శనివారం మాత్రం వీఐపీలకు ఎలాంటి మర్యాదలు లేకుండా దర్శనంతో పాటు ఇతరులకు లఘు దర్శనం అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. వారాంతం కావడంతో మరో మూడు రోజుల రద్దీ అధికంగా ఉంటుందని భావించిన ముందస్తుగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. రద్దీ సాధారణ స్థాయికి వచ్చినట్టయితే వీఐపీ బ్రేక్‌ దర్శనం టిక్కెట్లను ఎక్కువగా జారీచేసి, వారిని కులశేఖరపడి వరకు అనుమతిస్తారు. గతంలో దాతలకు అమలుచేస్తున్న సౌకర్యం యథావిధిగా సాగిస్తున్నారు. రూ.కోటి విరాళమిచ్చిన దాతలకు గతంలో ఎల్‌-1 కింద టిక్కెట్లు కేటాయించేవారు. వీరిని ఇకపై ప్రొటోకాల్‌ ప్రముఖులతో పాటు శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి దర్శనం చేయిరు. రూ.10 లక్షలు ఇచ్చిన దాతలకు ఎల్‌-2 కింద దర్శనానికి అనుమతిస్తుండగా.. ఇకపై బ్రేక్‌ దర్శనానికి మాత్రమే వారికి అవకాశమిస్తారు. కొత్త విధానంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని, రద్దీ లేనప్పుడు బ్రేక్‌ దర్శనానికి అధిక ప్రాధాన్యమిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు శ్రీవారి ఆర్జితసేవలు, గదులు, కల్యాణమండపాలు తదితరాలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులు వాటిని రద్దు చేసుకున్న పక్షంలో త్వరగా రీఫండ్‌ చెల్లించేలా అప్లికేషన్‌లో మార్పులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఐటీ సిబ్బందిని టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో గురువారం ఐటీ విభాగంపై ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.