జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌లో సహజ సిద్ధంగా ఏర్పడే మహా మంచు శివలింగాన్ని దర్శించుకోడానికి భక్తులు భారీగా వెళ్తారు. దాదాపు 4 వేల అడుగుల ఎత్తున ఏడాదిలో 45 రోజులు మాత్రమే ఉండే ఈ శివలింగం దర్శించుకోవాలంటే కష్టంతో కూడుకున్నదే. అయినా, వీటిని భక్తులు అధిగమించి వెళ్లి మహాదేవుని దర్శించి ఆధ్యాత్మిక అనుభూతి పొందుతారు. ఈ ఏడాది పవిత్ర అమర్‌నాథ్ యాత్ర సోమవారం ప్రారంభమైంది. సోమవారం ఉదయం 5.30గంటలకు అనంత్‌నాగ్ జిల్లా డెవలప్‌మెంట్ విభాగం కమిషనర్ ఖలీద్ జహంగీర్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఆదివారం జమ్మూ నుంచి బల్తాల్ బేస్ క్యాంప్‌నకు బయలుదేరిన 2,234 మంది యాత్రికుల బృందం నేడు యాత్రను ప్రారంభించింది. ఉగ్రముప్పు పొంచి ఉండటంతో అమర్‌నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
అమర్ నాధ్ కు చేరుకున్న తొలి బ్యాచ్
ఇప్పటి వరకు ఈ ఏడాది మొత్తం 1.50 లక్షల మంది భక్తులు అమర్‌నాథ్ యాత్రకు పేరు నమోదుచేసుకున్నారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహెల్గామ్, గండేర్బల్ జిల్లాలోని బల్తాల్ మార్గాలలో అమర్‌నాథ్‌కు చేరుకుంటారు. జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి ఆదివారం సాయంత్రం బైక్‌లు సహా 93 వాహానాల్లో తొలి బృందం బయలుదేరింది. వీళ్లు బల్తాల్ బేస్ క్యాంప్ ద్వారా అమర్‌నాథ్ చేరుకుంటారు. యాత్రికులు, వాహనాలకు చిప్ ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థ, శాటిలైట్‌తో అనుసంధానం చేశారు. యాత్రకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా వివిధ దశల్లో భద్రతా సిబ్బందిని మోహరించినట్టు అధికారులు వెల్లడించారు.ప్రత్యేకంగా ద్విచక్రవాహన సీఆర్పీఎఫ్ బలగాలను గతేడాది నుంచి వినియోగిస్తున్నారు. వీరు ధరించే హెల్మెట్‌కు కెమెరాలను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారితోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. కశ్మీర్ లోయలో అదనంగా 300 కంపెనీల బలగాలను మోహరించినట్టు తెలిపారు. శ్రీనగర్- జమ్మూ జాతీయ రహదారి, అమర్‌నాథ్ యాత్ర మార్గానికి ఇరువైపులా భద్రతా సిబ్బంది, ఏదైనా ప్రమాదం సంభవిస్తే తక్షణమే స్పందించే బలగాలు, డ్రోన్, యూఏవీలు వినియోగిస్తున్నారు. యాత్రికుల వాహనాలకు రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు ట్యాగ్‌లను అమర్చి, వీటికి కంట్రోల్ రూమ్‌లోని రాడార్‌లతో అనుసంధానం చేయనున్నారు. భద్రతా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి అమర్‌నాథ్ ఆలయ బోర్డు ప్రతి యాత్రికుడికి బార్‌కోడ్‌లను అందించింది. వీటిని యాత్ర మార్గంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన టవర్‌లతో అనుసంధానించనున్నారు. గతేడాది అమర్‌నాథ్ గుహను 2,85,006 మంది భక్తులు దర్శించుకున్నారు. అయితే, 2015లో 3,52,771 మంది, 2016లో 3,20,490 మంది, 2017లో 2,60,003 మంది భక్తులు దర్శించుకోవడం విశేషం