ఇసుకెక్కడ..? (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇసుకెక్కడ..? (పశ్చిమగోదావరి)

ఏలూరు, జూలై 19  (way2newstv.com): 

జిల్లాలో ప్రస్తుతం ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడింది. గతంలో పాటదారులు ఉన్న సమయంలోనే ఇసుక తక్కువ ధరకు వచ్చేది. గత ప్రభుత్వం ఉచితంగా అందించినప్పటికీ గతం కన్నా ఎక్కువ ధర పెడితే తప్ప ఇసుక దొరకని పరిస్థితి ఉండేది. నూతన ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది. సెప్టెంబరు 5 నుంచి కొత్త విధానం అమల్లోకి తీసుకు రావాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అప్పటి వరకు తమ పరిస్థితి ఏమిటని నిర్మాణదారులు వాపోతున్నారు.ఇసుక కొరత ప్రభావం వల్ల జిల్లాలో నిర్మాణరంగం కుదేలవుతుంది. దీనికి తోడు ఇంతకు ముందు వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను అక్రమ మార్గంలో విక్రయించారు. ప్రస్తుతం ఎక్కడా ఇసుక లభ్యత లేకపోవడంతో నిర్మాణరంగం పూర్తిగా చతికిలపడింది. 
ఇసుకెక్కడ..? (పశ్చిమగోదావరి)

తణుకు, ఏలూరు, భీమవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం వంటి పట్టణాల్లో అపార్ట్‌మెంట్లు, వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇసుక కొరత కారణంగా ఆ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం గోదావరికి వరదనీరు వచ్చి చేరుతుంది. గోదావరి వరద ప్రభావం అక్టోబరు చివరి వరకు ఉంటుంది. సెప్టెంబరులో ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చినా అక్టోబరు వరకు ఇసుకకు ఇబ్బందులు తప్పేలా లేవు.జిల్లాలో భవన నిర్మాణ రంగానికి సంబంధించి సుమారు 12 లక్షల మంది వరకు పని చేస్తున్నారు. వారంతా ప్రస్తుతం పనులు లేక విలవిలలాడుతున్నారు. వివిధ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో సుమారు రూ.150 కోట్లకు పైగా వివిధ రకాల పనులు జరగుతున్నాయి. వీటిపై కూడా ఇసుక ప్రభావం పడటంతో పనులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే నిర్మాణ రంగంతో పాటు వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇసుక కోసం ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలికంగానైనా ఒక స్పష్టమైన విధానం అమలు చేసి, ర్యాంపుల ద్వారా ఇసుక అందించే ఏర్పాటు అధికార యంత్రాంగం చేయాలని పలువురు కోరుతున్నారు.