శాటిలైట్ టెర్మినల్స్... బహుదూరం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శాటిలైట్ టెర్మినల్స్... బహుదూరం

సికింద్రాబాద్, జూన్ 27, (way2newstv.com)
కొత్త రైల్వే శాటిలైట్ టెర్మినళ్ల ఏర్పాటు ప్రతిపాదన ఏమాత్రం ముందుకు కదలడం లేదు. నగరంపై విపరీతంగా ట్రాఫిక్ ప్రభావం పడుతున్న సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి కొన్ని రైళ్లను కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన టెర్మినళ్లకు మళ్లించాలని ద.మ.రైల్వే ప్రతిపాదించింది. ఇందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్, వట్టినాగులాపల్లి రైల్వే స్టేషన్ వద్ద కొత్తగా శాటిలైట్ రైల్వే టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఈ ప్రతిపాదన గత రెండేళ్ల నుంచి సాగుతున్నా ఆచరణలో అడుగు ముందుకు పడలేదు. ఇటీవల రైల్వే మంత్రి పీయూష్ గోయల్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ అంశంపై ఆయనకు విజ్ఞప్తి చేశారు. రైల్వే బోర్డు ముందుకు ఈ ప్రతిపాదన తీసుకెళతానని మంత్రి హామీ ఇచ్చారు. 
శాటిలైట్ టెర్మినల్స్... బహుదూరం

అయితే టెర్మినళ్ల ఏర్పాటుకు ముందు భూసేకరణ అనేది ప్రధాన అంశం. ప్రస్తుతం ఉన్న రైల్వే భూమి టెర్మినల్ ఏర్పాటుకు ఏమాత్రం సరిపోదు. తెలంగాణ ప్రభుత్వం నుంచి భూమిని రైల్వేకు అప్పగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి భూమికి సంబంధించిన పని ఏదీ జరగలేదు. ముఖ్యంగా చర్లపల్లి టెర్మినల్‌ను 150 నుంచి 200 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ముందు ప్రణాళిక సిద్ధం చేసింది. మొత్తం ప్రాజెక్టును రూ.235 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనను రైల్వే శాఖకు ద.మ.రై పంపించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కన్నా పెద్దగా, రానున్న 40 ఏళ్ల వరకు అవసరమైన రైళ్ల రాకపోకల డిమాండ్‌ను అంచనా వేసి భారీ స్ధాయిలో చర్లపల్లి స్టేషన్‌ను శాటిలైట్ టెర్మినల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని భావించింది. రైళ్లను పార్కింగ్ చేసేందుకు వీలుగా ఎక్కువ ట్రాక్‌ల ఏర్పాటు, 10 ఫ్లాట్ ఫాంలు, ఎస్కలేటర్లు, లిఫ్పులు వంటి అత్యాధునిక సదుపాయాలతో చర్లపల్లి టెర్మినల్‌కు డిజైన్‌ను సైతం సిద్ధం చేసింది. ప్రస్తుతం చర్లపల్లి స్టేషన్‌కి 50 ఎకరాల రైల్వే స్థలం మాత్రమే ఉంది. మరో 150 నుంచి 200 ఎకరాల వరకు సేకరించి అప్పగించాలని ద.మ.రై రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదన ప్రభుత్వానికి ఇప్పటికే అందించింది. అయితే అక్కడ అంత భూమి సేకరించడం సాధ్యం కాదని భావించి ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోతోందని సమాచారం. అప్పటివరకు వేచి చూడకుండా ద.మ.రైల్వే చర్లపల్లి స్టేషన్‌కు ఉన్న 50 ఎకరాల విస్తీర్ణంలో సరిపడా స్టేషన్‌ను అభివృద్ధి చేసుకుంటూ పోవాలని నిర్ణయించింది. అయితే శాశ్వత ప్రాతిపదికన భారీ విస్తరణ చేపట్టి టెర్మినల్ ఏర్పాటు చేస్తే మంచిదని రైల్వే యోచిస్తోంది. తొలుత 2016-17లో రూ.81 కోట్ల వ్యయంతో చర్లపల్లి టెర్మినల్ ఏర్పాటు చేయాలని రైల్వే ప్రతిపాదించింది. నాగులాపల్లి రైల్వే స్టేషన్‌ను సైతం టెర్మినల్‌గా తీర్చిదిద్దే ప్రతిపాదనను కూడా ప్రభుత్వానికి రైల్వే శాఖ తెలియజేసింది. అది కూడా ఒక్క అడుగు ముందుకు పడలేదు. నగర నడిబొడ్డున ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నందున ప్రయాణీకుల తాకిడితో స్టేషన్ల సమీపంలో విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు రెండు రైల్వే టెర్మినల్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. అయితే నాగులాపల్లి టెర్మినల్ ఫీజిబిలిటీపై ఇంకా అధ్యయనం జరుగుతున్నట్లు తెలిసింది. ఈలోగా రైళ్ల నిలుపుదల, కొన్ని రైళ్లు బయలుదేరేందుకు వీలుగా ప్రస్తుతం నగర శివారులో ఉన్న లింగపల్లి రైల్వే స్టేషన్‌ను కొంత వరకు విస్తరించారు. ప్రస్తుతం కొన్ని రైళ్లను అక్కడి నుంచే వివిధ గమ్య స్ధానాలకు పంపిస్తున్నారు. చర్లపల్లి స్టేషన్ సికింద్రాబాద్‌కు దగ్గరగా ఉండడంతో అక్కడ కొన్ని దూర ప్రాంత సర్వీసులకు హాల్ట్ కల్పించింది. అక్కడ కొందరు ప్రయాణీకులు దిగినా సికింద్రాబాద్ స్టేషన్‌పై భారం తగ్గుతుందని భావించి కృష్ణా ఎక్స్‌ప్రెస్, శబరి ఎక్స్‌ప్రెస్, రేపల్లె ప్యాసింజర్, విశాఖ ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరికొన్నింటికి హాల్ట్ ఏర్పాటు చేశారు. ఇలా ఉన్నంతలో రద్దీని తగ్గించే ప్రయత్నం ద.మ.రైల్వే చేస్తోంది