స్పీడ్ పెంచారో.. పర్స్ ఖాళీ (విజయవాడ) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్పీడ్ పెంచారో.. పర్స్ ఖాళీ (విజయవాడ)

విజయవాడ, జూలై 18 (way2newstv.com): 
హదారులపై వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించేందుకు స్పీడ్‌గన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ పోలీసులకు  కృష్ణా జిల్లా పోలీసులకు  కృష్ణా జిల్లా రవాణా శాఖకు వీటిని రహదారులపై వాహనాలు వేగంగా వెళ్లే ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని గుర్తిస్తున్నారు. వేగ పరిమితి దాటితే చాలు.. వెంటనే స్పీడ్‌గన్‌ ఆ వేగాన్ని గుర్తిస్తుంది. ఆ తరువాత 5 క్షణాల్లో సదరు వాహన యజమాని మొబైల్ కు మెసేజ్ పంపిస్తుంది. ముందుగా ఎక్కడైతే వాహనాలు వేగంగా వెళతాయో అక్కడ స్పీడ్‌గన్‌ ఏర్పాటు చేస్తారు. రహదారిపై వచ్చే వాహనాలను స్పీడ్‌గన్‌ పరిధిలోకి వచ్చేలా రోడ్డుపై పెడతారు. ఒక్కోసారి స్పీడ్‌గన్‌ అందరికీ కనిపించేలా ఉంచుతారు. లేకపోతే డివైడర్‌ మధ్యలోని చెట్ల మధ్య రహస్యంగా ఉంచి వాహనాలపై కేసులు నమోదు చేస్తారు. 
 స్పీడ్ పెంచారో.. పర్స్ ఖాళీ (విజయవాడ)

ముందుగా ఆ ప్రాంతంలో ఎంత వేగ పరిమితి ఉందో దాన్ని స్పీడ్‌గన్‌లో నమోదు చేస్తారు. స్పీడ్‌గన్‌ 250 మీటర్ల దూరం నుంచి 500 మీటర్ల దూరం వరకు ఉన్న వాహనాలను గమనించొచ్చు. అయితే నెంబరు ప్లేటు స్పష్టంగా గుర్తించాలంటే సదరు వాహనం 150 నుంచి 250 మీటర్లు దూరం ఉంటే బాగుంటుంది. ఏదైనా వాహనం ఆ వేగ పరిమితి దాటగానే వెంటనే దాన్ని స్పీడ్‌గన్‌ గుర్తించి కేసు నమోదు చేస్తుంది. వెంటనే ఇ-వీసీఆర్‌ రవాణా శాఖ పోర్టల్‌కు చేరుతుంది. అక్కడ నుంచి వాహన యజమాని ఇంటి చిరునామాకు పోస్టులో పంపిస్తారు. స్పీడ్ లిమిట్ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. దీన్ని ఆయా ప్రాంతాల్లో రోడ్డు పక్కన సూచికల్లో ఉంచుతారు. ఉదాహరణకు సూచికలో 20 నెంబరు ఉంటే ఆ మార్గంలో వేగపరిమితి 20. అదే 40 నెంబరు ఉంటే 40 కిలోమీటర్ల లోపు వెళ్లాలి. అలా ఎంత నెంబరు ఉంటే అంత వేగంలో మాత్రమే వెళ్లాలి.జాతీయ రహదారులు 40 నుంచి 90 వరకు (నగరం మధ్య గుండా పోయేటప్పుడు వేగ పరిమితి 40 కిలోమీటర్లు ఉంటుంది. అదే ఖాళీగా ఉండే ప్రాంతంలో అది 90 వరకు ఉంటుంది.) మీరు ఎక్కడైనా వేగ పరిమితి దాటితే 3 క్షణాల్లో దాన్ని గుర్తించి మీకు వెంటనే ఇ-చలానా(ఇ-వీసీఆర్‌.) పడుతుంది.మీరు వేగ పరిమితి దాటగానే మీకు ఇ-వీసీఆర్‌ వస్తుంది. దానిలో తేదీ, సమయం, ప్రాంతం ఉంటాయి. మీ వాహనం నెంబరు, వాహనం కేటగిరి (కారు/ ద్విచక్ర వాహనం/లారీ) ఉంటుంది. మీరు వెళ్లిన ప్రాంతంలో వేగపరిమితి ఎంత? మీరు ఎంత వేగంతో వెళ్లారు? అన్నీ స్పష్టంగా ఉంటుంది. మీరు డేంజరస్‌ డ్రైవింగ్‌ చేసినందుకు మీకు రూ.1400 జరిమానా విధించామంటూ ఇ-వీసీఆర్‌లో ఉంటుంది. మీ సమీపంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో అపరాధ రుసుం చెల్లించాలని ఉంటుంది. మీ వాహనం ఫొటో కూడా ఇ-వీసీఆర్‌లో పెడతారు.కృష్ణా జిల్లా రవాణా శాఖకు 2018 జులై నెలాఖరులో 1 స్పీడ్‌గన్‌ ఇచ్చారు. ఆగస్టు మొదటి వారం నుంచి కేసులు నమోదు ప్రారంభించారు. ఈ ఏడాది జులై 4 వరకు మొత్తం 4,101 కేసులు నమోదు చేశారు. వీటిలో 498 మంది వాహన యజమానులు ఒక్కొక్కరు రూ.1,400 చొప్పున మొత్తం రూ.6.97 లక్షలు అపరాధ రుసుం కృష్ణా జిల్లా రవాణా శాఖకు చెల్లించారు. మిగిలిన వాహనాల యజమానులకు ఇంటికి ఇ-వీసీఆర్‌లు పోస్టులో పంపించారు.