అనసూయకు ఎంత అసూయ... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అనసూయకు ఎంత అసూయ...

హైద్రాబాద్, జూలై 23 (way2newstv.com)
యాంకర్ అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ‘నాగ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘జబర్దస్త్’ కామెడీ షోతో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు పిల్లల తల్లి ఆ తరవాత సినిమాల్లోనూ మంచి అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయన’లో నాగార్జునకు మరదలుగా నటించి ఆయనతో స్టెప్పులేశారు. ‘రంగస్థలం’లో అద్భుతమైన పాత్రలో నటించి ప్రేక్షకులతో రంగమ్మత్త అని పిలుపించుకున్నారు. ఆ తరవాత కూడా అడపదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు బోలెడంత మంది ఫాలోవర్లు ఉన్నారు. వీళ్లందరికీ సోమవారం అనసూయ ఒక సందేశాన్ని పంపారు. 
అనసూయకు ఎంత అసూయ...

అది ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. పెళ్లి, పిల్లలు ప్రస్తావనను తన వద్ద తీసుకొచ్చే వారికి అనసూయ ఈ మెసేజ్ ద్వారా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. భర్త సుశాంక్ భరద్వాజ్, ఇద్దరు పిల్లలతో కలిసి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అనసూయ.. వ్యక్తిగత జీవితం గురించి అభిమానులకు కొన్ని విషయాలు చెప్పారు. ‘‘అనసూయ.. చాలా తొందరగా పెళ్లి చేసుకున్నావ్. లేకపోతే టాప్ హీరోయిన్‌వి అయిపోయేదానివి’’ అని.. ‘‘ఎందుకు ఊరికే ఫ్యామిలీ పిక్స్ పెడతావ్. నీకు డిమాండ్ తగ్గిపోతుంది’’ అని చాలా మంది అనసూయతో అంటుంటారట. ఈ కామెంట్లకు అనసూయ ఇప్పుడు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తాను ఇప్పటి వరకు సాధించిన దాని గురించి అస్సలు సిగ్గుపడటంలేదని ఆమె అన్నారు. తన జీవితంలో ఎప్పటికీ అతిపెద్ద విజయం తన కుటుంబమేనని చెప్పారు. ‘‘నిజాన్ని నేను ఎప్పటికీ మరిచిపోను. పక్కన పెట్టను. రోజంతా కష్టపడి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ మనల్ని ప్రేమించే, మనం ప్రేమించే వాళ్లుంటారు. ఇది అందరి ఇళ్లలో జరిగేదే. మీ ప్రాధాన్యతలను మీరు తెలుసుకోండి. నేను పెళ్లిచేసుకోవడం, తల్లిని కావడం వంటి అంశాలు నా వృత్తిమీద ప్రభావం చూపకూడదు. ఈ విషయంలో మగవాళ్లకు లేని ఇబ్బందులు మా ఆడవాళ్లకు ఎందుకు???’’ అని అనసూయ ప్రశ్నించారు. అదృష్టవశాత్తు తనతో సమాన ప్రతిభగల వారితో పనిచేశానని, పనిచేస్తున్నానని.. వారు తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై మాట్లాడరని అనసూయ అన్నారు. మొత్తానికి పెళ్లి, భర్త, పిల్లలు విషయాలను అస్తమాను ప్రస్తావించే వారికి అనసూయ గట్టిగానే సమాధానం ఇచ్చారు