స్పష్టం చేసిన రాహుల్ గాంధీ
న్యూ డిల్లీ జూలై 3 (way2newstv.com)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో ఎట్టిపరిస్థితుల్లో కొనసాగేదిలేదని రాహుల్ గాంధీ తెలిపారు. పార్టీయే తొందరగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్నారు. ఎటువంటి జాప్యం చేయకుండా పార్టీ చీఫ్‌ను ఎంపిక చేయాలని రాహుల్ తెలిపారు. తాను అధ్యక్ష పదవికి ఇప్పటికే రాజీనామా చేశానని, ఇక పార్టీ చీఫ్ ఎంపిక ప్రక్రియతో తనకు సంబంధంలేదన్నారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఎంత వారించినా.. రాహుల్ మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంలేదు.
పార్టీ అధ్యక్ష పదవిలో ఎట్టిపరిస్థితుల్లో కొనసాగను
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వీలైనంత త్వరగా సమావేశం కావాలని, కొత్త చీఫ్ గురించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని రాహుల్ అన్నారు. పార్లమెంట్‌లో ఇవాళ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది. దీంతో మనస్తాపానికి గురైన రాహుల్ మే 25వ తేదీన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రాహుల్ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో.. మరో వారం రోజుల్లోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.