మా ఊళ్లకు బస్సులేయండి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మా ఊళ్లకు బస్సులేయండి


మహబూబ్ నగర్, జూలై 6, (way2newstv.com)
చదువు కోసం విద్యార్థులు ప్రాణాలనే ఫణంగా పెట్టి ప్రయాణించాల్సిన దుస్థితి పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలలో చదువుకుంటున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రతిరోజు సర్కస్ ఫీట్లు చేస్తూ దినదిన గండంగా బస్‌లో ప్రయాణం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ పట్టణ సమీపంలో ఉన్న తెలకపల్లి, బిజినేపల్లి, తాడూరు, కోడేరు, గోపాల్‌పేట, నాగర్‌కర్నూల్ మండలాల నుండి వందలాది మంది విద్యార్థులు నాగర్‌కర్నూల్‌కు ప్రతిరోజు బస్‌లో వచ్చిపోతూ చదువుకుంటున్నారు. ప్రతిరోజు బస్‌కోసం విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బస్‌టాప్‌పై ప్రయాణం చేస్తు న్నారు. ముఖ్యంగా బస్‌టాప్‌పై ప్రయాణం ఒక ప్రాణగండంగా మారుతోందని పలువురు విద్యార్థులు అన్నారు. 

మా ఊళ్లకు బస్సులేయండి 

విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా గత్యంతరం లేక విద్యార్థులు బస్‌టాప్‌పైనే ప్రయాణం చేయాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు ఉదయం, సాయంత్రం పూటే బస్‌లు ఉండటంతో విద్యార్థులతో పాటు వివిధ పనులపై ప్రజలకు కూడా అదేబస్ దిక్కుకావటంతో గత్యంతరంలేక ఈ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఆయా మార్గాలలో నడస్తున్న బస్ డ్రైవర్లు, కండక్టర్లు కొంతమంది ఉచిత బస్‌పాస్‌లు, రాయితీతో కూడిన బస్‌పాస్‌లు ఉన్న విద్యార్థులను బస్‌టాప్‌పైకి పంపుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎక్కువ ప్రయాణికుల రద్దీ ఉన్న ప్రాంతాలకు బస్‌ల ట్రిప్‌లను పెంచాలని ఎన్నిసార్లు అధికారులను కోరినా ప్రయోజనం ఉండటం లేదని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేవిధంగా బస్‌లను నడపాలని, బస్‌టాప్‌పై ప్రయాణం చేయకుండా తగిన భద్రత చర్యలు తీసుకొని, అవసరమైన బస్‌ల ట్రిప్‌లను పెంచాలని వారు కోరుతున్నారు. సాయంత్రం పూట విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఒకేసారి అన్ని పాఠశాలలు, కళాశాలలు వదలడంతో అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఒకేసారి బస్టాండ్‌కు చేరడంతో విద్యార్థులతో బస్టాండ్ కిటకిటలాడుతోంది. బస్టాండ్‌లో ఒకవైపు బస్సుల రాకపోకలు, మరోవైపు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆందోళన నెలకొంది. ఒక బస్సు వస్తే విద్యార్థులంతా బస్సు ఆగకముందే పిల్లలు బస్సులో సీటు వేసుకునేందుకు ప్రయత్నించడం చేస్తున్నారు.